సినిమాల్లో కథాంశం ఎలా ఉండాలి? హీరో పాత్ర ఎలా ఉండాలి? అనే విషయంలో ప్రేక్షకుల అభిరుచులు తరచూ మారుతూ ఉంటాయి. కానీ ఒక కథకు మాస్ యాక్షన్, ఎమోషన్, పవర్‌ఫుల్ పాత్ర చేరిస్తే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇప్పుడు అలాంటి ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. రామ్ చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC16 (RC 16 Movie) ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో చరణ్ పాత్ర ఊహించనిదిగా ఉంటుందని తాజా సమాచారం.
ఈ సినిమాలో చరణ్ ‘ఆట కూలీ’గా కనిపించనున్నాడట. కథలో అతని క్యారెక్టర్ తీరుతెన్నులు ఇప్పటి వరకు వచ్చిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. సాధారణంగా ఒకే ఆట చుట్టూ కథ నడుస్తుంటుంది. కానీ ఇందులో మాత్రం క్రికెట్, కుస్తీ, కబడ్డీ – ఇలా మూడు ఆటలు మిక్స్ అవుతాయట. ఈ లైన్ సినిమా పట్ల క్యూరియాసిటీని మరింత పెంచేస్తోంది. రంగస్థలం తర్వాత చరణ్ మళ్లీ పూర్తిగా రూట్ మార్చేలా కనిపిస్తోంది.
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందించడంతో, మ్యూజిక్ లవర్స్‌లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. చరణ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా ఆసక్తికరంగా మారింది. బుచ్చిబాబు గతంలో ఉప్పెన చిత్రంలో ఎమోషన్లకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చినట్లు, ఈ సినిమాలో కూడా హీరో పాత్రలో ఓ ప్రత్యేకమైన ఇంటెన్సిటీ ఉంటుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ మూవీని పూర్తి పాన్ ఇండియా లెవెల్‌లో ప్రమోట్ చేయనున్నారు.
ఈ సినిమాలో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ఓ కీలకమైన కోచ్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జగపతిబాబు (Jagapathi Babu), మేఘన్ రాజ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ వేగంగా సాగుతోంది. టీజర్, ఫస్ట్ లుక్ త్వరలోనే రాబోతోందని సమాచారం. రంగస్థలం (Rangasthalam) తర్వాత రామ్ చరణ్ మరోసారి మాస్ లుక్‌లో అలరించనున్నాడన్న టాక్ ఫ్యాన్స్‌లో హైప్‌ను మరింత పెంచుతోంది. మరి, బుచ్చిబాబు సానా ఈ ప్రాజెక్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.