రామ్ గోపాల్ వర్మ దర్శకుడే కాదు.. మంచి టెక్నీషియన్ కూడా. ఒకప్పుడు ఆయన సినిమాల్లో పాటలన్నీ అద్భుతంగా ఉండేవి. వాటిని తెరకెక్కించే తీరు కూడా కొత్తగా ఉంటుంది. ఆయన మొదటి సినిమా ‘శివ’ మ్యూజికల్ గా పెద్ద హిట్టు. ఆ పాటల పిక్చరైజేషన్ అదిరిపోతుంది. ‘గోవింద గోవింద’, ‘క్షణక్షణం’ ఇలా ఆయన తెరకెక్కించిన సినిమాల్లో పాటలన్నీ బాగుంటాయి. ‘రంగీలా’ అయితే అందరికీ ఆల్ టైం ఫేవరెట్. సంగీతంపై రామ్ గోపాల్ వర్మకి మంచి అవగాహనే ఉంది.
తన దృష్టిలో ప్రపంచంలో అత్యుత్తమ సాంగ్ ఒకటుందట. అదే .. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాటల్లో అదొకటి. మోటివేషన్ గీతాల్లో కూడా ఈ పాట టాప్ ప్లేస్ లో ఉంటుంది. వర్మకి ఈ పాట అంటే చాలా ఇష్టమట. ‘ప్రపంచ సాహిత్యంలో చాలా రకాలైన పాటలొచ్చాయి. ప్రపంచ భాషల్లో కొన్ని వేల లక్షల పాటలున్నాయి. వాటిలో నాకు తెలిసినంత వరకూ ఇదే బెస్ట్ సాంగ్’ అంటూ ఈ పాట గురించి చెప్పుకొచ్చారు.
ఈ పాట విన్న తరువాత సీతారామశాస్త్రిపై ఉన్న గౌరవం రెట్టింపయిందని అన్నారు. అయితే ఈ పాటను చిత్రీకరించిన తీరు మాత్రం అసలు నచ్చలేదట. ఈ పాటను ‘పట్టుదల’ అనే సినిమా కోసం రాశారు సిరివెన్నెల. సుమన్ పై ఈ పాటను తెరకెక్కించిన తీరు చూస్తే.. చచ్చిపోవాలనిపిస్తుందని అన్నారు వర్మ. ఈ పాట ‘బాహుబలి’ స్థాయిలో పెద్దగా ఉండాలని.. కానీ పాడు చేశారని తెగ బాధపడిపోయారు వర్మ.
ఇక సీతారామశాస్త్రి రాసిన బెస్ట్ సాంగ్ లో ‘సిరివెన్నెల’ సినిమా ముందు వరసలో ఉంటుంది. కానీ అందులో ఒక్క పాట కూడా వినలేదని చెప్పారు వర్మ. అలాంటి పాటలను ఇష్టపడే మైండ్ తనకు లేదని అన్నారు.