సినిమా హీరోలకు కొన్ని బిరుదులు ఉంటాయి. అవి ఎవరిచ్చారు, ఎవరు ఓకే చేశారు, ఎన్నేళ్లు ఉంటాయి అనేది ఎవరూ చెప్పలేరు. అయితే అలా వచ్చిన బిరుదులు, ట్యాగ్‌ల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఓ నాలుగు సినిమా టికెట్లు ఎక్కువ తెగుతాయా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఏళ్లుగా వింటూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ కథానాయిక, అభిమానులతో నేషనల్ క్రష్ అని పిలిపించుకుంటున్న రష్మిక మందన (Rashmika Mandanna) ఈ విషయం చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్నా..
ఇంకా సరైన విజయం రుచి చూడని రష్మిక మందన లేటెస్ట్‌గా ‘ఛావా’ (Chhaava) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘నేషనల్ క్రష్’ అనే ట్యాగ్ గురించి మాట్లాడింది రష్మిక. ఇప్పటికే ఈ ట్యాగ్ గురించి ఇటీవల కాలంలో ఎక్కువగా మాట్లాడుతూ వచ్చిన ఆమె ఇప్పుడు ట్యాగ్‌ల వల్ల సినిమా టికెట్లు అమ్ముడుపోవు అని చెప్పుకొచ్చింది. నటులకు ఇచ్చే ట్యాగ్‌ల కంటే ప్రేక్షకులు చూపించే ప్రేమాభిమానాలు ముఖ్యమని చెబుతోంది రష్మిక మందన.
కెరీర్‌కు ట్యాగ్స్ ఉపయోగపడతాయంటే నేను నమ్మను. కొంతమంది అభిమానులు ప్రేమగా ట్యాగ్స్ ఇస్తుంటారు. అవి కేవలం ట్యాగ్స్ మాత్రమే. ఆ అభిమానాలు టికెట్ సేల్స్‌పై ప్రభావం చూపించవు అని చెప్పుకొచ్చింది రష్మిక. తాను అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చానని, ఇప్పటికే 24 చిత్రాల్లో నటించానని, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నానని చెప్పిందామె. ఆమె సినిమాల సంగతి చూస్తే.. ‘ఛావా’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ సతీమణి ఏసుబాయి పాత్రలో నటించారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ‘ఛావా’ సినిమా కథ చెప్పినప్పుడు షాకయ్యానని చెప్పుకొచ్చింది రష్మిక. ఇవన్నీ ఓకే అవ్వొచ్చు. రష్మిక ట్యాగ్స్ అనే మాట అన్నది తన గురించేనా? లేక ఇండస్ట్రీలో ఉన్న అందరి ట్యాగ్స్ గురించి మాట్లాడిందా అనేది ఆమెకే తెలియాలి.