అందంతోనే కాదు, అభినయంతోనూ కూడా మెప్పించగలను అని ‘శ్రీవల్లి’ పాత్రతో మరోసారి చేసి చూపించింది రష్మిక మందన (Rashmika Mandanna). ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో ఆ పాత్ర ఎంతగా ప్రేక్షకుల మెప్పు పొందిందో మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు రాబోయే ‘పుష్ప: ది రూల్’ (Pushpa2) సినిమాతో అంతకుమించి ఉంటుంది అని చెబుతోంది రష్మిక. ఆమె మాటల్లో చెప్పాలంటే ‘రష్మిక 2.0’ని చూస్తారు అని చెబుతోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె సినిమా గురించి, తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.
అల్లు అర్జున్‌కి (Allu Arjun) జోడీగా ‘పుష్ప: ది రైజ్’లో (Pushpa) రష్మికను చూసి ఫ్యాన్సే కాదు, ప్రేక్షకులు కూడా వావ్ అనుకున్నారు. అమాయకంగా, అందంగా, గడసరిగా ఆమె అదరగొట్టేసింది అని చెప్పాలి. ఆ పాత్ర గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తే ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు కథ గురించి మొదట్లో తనకు ఎలాంటి అవగాహన లేదని, శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుందో తెలియదని చెప్పింది. అంతేకాదు తాము ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నామో కూడా ఊహించలేకపోయాను అని చెప్పింది.
దీంతో సెట్లో అడుగు పెట్టినప్పుడు ఖాళీ మైదానంలో తిరుగుతున్నట్లు అనిపించేదట. అయితే ఇప్పుడు అలా కాదని, ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసని, అందుకే శ్రీవల్లి పాత్ర కోసం కసరత్తులు చేస్తున్నాను. అలాగే మొదటి భాగంలో కంటే రెండో భాగంలో తన పాత్ర బలంగా ఉంటుందని, అందుకే శ్రీవల్లి 2.0 చూస్తారు అని చెప్పింది. ఈ సీక్వెల్ షూటింగ్ మొదలైన తొలి రోజుల్లో ఈ పాత్రను త్వరగా ముగించేస్తారని వార్తలొచ్చాయి. ఇప్పుడు క్రష్మిక మాటలు వింటుంటే అవి పుకార్లే అని తేలిపోయింది.
ఇదంతా ఓకే కానీ… నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అని అడిగితే… తన సినిమాల్లో ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) హృదయానికి బాగా దగ్గరైన సినిమా అని చెప్పింది. నిజానికి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యాన్స్, రష్మిక ఫ్యాన్స్‌కి ఇది బాగా నచ్చిన సినిమానే. అయితే బాక్సాఫీసు దగ్గర సరైన విజయం అందుకోలేదు అంతే.