సినిమాలయందు రవిబాబు సినిమాలు వేరయా.. అని చెప్పొచ్చు. చేసేవి చిన్న సినిమాలు అయినా.. వరుసగా ఏ రెండు సినిమాలు ఒకేలా ఉండవు. థ్రిల్లర్, హారర్ అంటూ ఒకే తరహా జోనర్‌లో తీసినా వేటికవే కొత్తదనంతో ఉంటాయి. అయితే మధ్యలో కొన్నిసార్లు అవుటాఫ్‌ది బాక్స్ సినిమాలు చేసే ప్రయత్నంలో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆయన సినిమాల్లో భయపెట్టడం అనేది కామన్. ఏదో ఒకటి చేసి భయపెట్టి.. జనాల్ని థ్రిల్ చేస్తుంటారు. మరి అలాంటాయన భయపడింది ఎప్పుడు. దీనికి సమాధానం ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
హారర్ సినిమాలు తీసే (Ravi Babu) రవిబాబుకు భయం అంటే నమ్మరేమో కానీ… ఇంట్లో ఎవ్వరూ లేకపోతే లైట్స్ అన్నీ ఆన్ చేసుకుని సోఫాలో పడుకుంటారట. ఎందుకంటే స్వతహాగా రవిబాబు భయస్తుడట. ఇంట్లో ఒక్కడే ఉండలేరట. అలా ఓసారి ఓ సినిమా షూటింగ్ చేసి హోటల్‌కి వెళ్లినప్పుడు అక్కడి స్టాఫ్ వచ్చి.. హోటల్‌లో బస చేస్తున్నది మీరొక్కరే అన్నాడట. 150 గదులున్న ఓ హోటల్‌లో ఒక్కడినేనా అని భయపడ్డారట రవిబాబు. రూమ్‌కి వెళ్లి టీవీ ఆన్ చేస్తే ‘పారానార్మల్ యాక్టివిటీ’ సినిమా వస్తోందట.
ఆ సినిమా పూర్తయ్యాక నిద్ర రాలేదట. దీంతో లగేజీ సర్దేసుకుని హోటల్ నుండి బయటికొచ్చేశారట. ఇంకోసారి మరో సినిమా షూటింగ్ సమయంలో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నప్పుడు ఓ హీరోయిన్ వచ్చి ‘ఇల్లు ఖాళీ చేస్తున్నాను, వంట గదిలోకి వెళ్తే వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. సోఫాలో కూర్చుంటే పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తోంది’’ అని చెప్పిందట.
ఆ హీరోయిన్ చెప్పిన విషయాలు, ఆయనకు హోటల్‌లో ఎదురైన అనుభవాల నుండే ‘అవును’ కథ పుట్టిందని రవిబాబు చెప్పారు. మరి మీ సినిమాలు చూస్తే మీకు భయం వేయదా అని అడిగితే. ‘‘సినిమా తీసేటప్పుడు ప్రతిదీ తెలుస్తుంది కదా, దాంతో నా సినిమాలు చూసి ఎప్పుడూ భయపడలేదు. అయితే వేరే వాళ్ల సినిమాలు చూసి భయపడతాను’’ అని చెప్పారు రవిబాబు. అంటే భయపెట్టే వాళ్లకు భయం వేస్తుంది అన్నమాట.