మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఠాగూర్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది.2003 సెప్టెంబర్ 24న ఈ చిత్రం విడుదలయ్యింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 17 ఏళ్ళు పూర్తికావస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రమణ’ చిత్రానికి ఇది రీమేక్. అక్కడ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు వి.వి.వినాయక్ చాలా అద్బుతంగా తెరకెక్కించాడు. అవినీతి, లంచం.. వంటి వాటి పై యుద్ధం చెయ్యడానికి ఓ కాలేజీ ప్రొఫెసర్ ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నాడు..
ఫలితంగా అతని జీవితం చివరికి ఏమైంది… అనేది ఈ చిత్రం కథాంశం. ఈ చిత్రంలో హాస్పిటల్ సీన్ హైలెట్ గా నిలిచింది. మణిశర్మ సంగీతంలో రూపుదిద్దుకున్న పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. మెగాస్టార్ కెరీర్ లో ఇది కూడా గుర్తుండి పోయే చిత్రం అనడంలో సందేహం లేదు. అయితే ఈ చిత్రానికి మొదటి ఛాయిస్ మెగాస్టార్ కాదట.నిజానికి మన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఈ చిత్రాన్ని చెయ్యాలట.
ఓ ప్రముఖ నిర్మాత రమణ రీమేక్ హక్కులను కొనుగోలు చేసి.. రాజశేఖర్ తో చెయ్యాలని ప్లాన్ చేసాడట. కానీ అప్పుడు రాజశేఖర్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ‘ఠాగూర్’ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ‘ఠాగూర్’ సినిమాని వదులుకున్నట్టు రాజశేఖర్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.