హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమా టెనెట్ విడుదలవ్వగానే.. థియేటర్లు మళ్ళీ తెరిచారు, అందరూ ఎలాంటి భయాలు లేకుండా థియేటర్లకు వెళ్ళండి అని ఎంకరేజ్ చేస్తూ తేజు విడుదల చేసిన వీడియో భలే వైరల్ అయ్యింది. ఒకరకంగా అది తన సినిమా ప్రమోషన్ కోసమే అయినప్పటికీ.. థియేటర్లు సేఫ్ అని జనాలు కాస్త ముందడుగు వేశారు. అయితే.. ఇప్పుడు తేజు సినిమాకు రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. అందుకు కారణం డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్స్ కు నిర్మాతలు ఇదివరకటిలా ప్రొజెక్టర్ చార్జీలు, ట్యాక్సులు కట్టడానికి ఆసక్తి చూపకపోవడం.
ఈమేరకు తెలుగు సినిమా నిర్మాతల మండలి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఆ పాయింట్స్ కు డిస్ట్రిబ్యూటర్స్ & ఎగ్జిబిటర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒప్పుకొనే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఈ లెక్కన అనుకున్న ప్రకారం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా “సోలో బ్రతుకే సో బెటర్” విడుదలవ్వడం కష్టమని స్పష్టమవుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? తేజు సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం.
నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతుండగా.. నభా నటేష్ కథానాయికగా నటిస్తోంది. విడుదలైన రెండు పాటలు కూడా హిట్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో థియేటర్ల ఇష్యు క్లియర్ అయ్యేవరకు వెయిట్ చేస్తారా లేక ఓటీటీ బాట పడతారా అనేది చూడాలి.