యటిట్యూడ్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ

రామ్‌గోపాల్‌ వర్మ లాంటి థగ్‌ లైఫ్‌ ఉన్న వాళ్లు ఎవరూ ఉండరు అంటుంటారు. అంతలా తనకు నచ్చినట్లు జీవితాన్ని జీవిస్తుంటారు వర్మ. అనుకున్నది చేద్దాం అంటూ దూసుకుపోతుంటారు. చాలామంది అలా బతకాలి అని అనుకుంటున్నారు కానీ బతకలేరు. మరి ఆయనకే ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న చాలామందిలో కనిపిస్తుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్‌ అయననే అడిగితే బాగుంటుంది అని కూడా అనుకుని ఉంటారు. అయితే అలాంటి వారి కోసం అలీ అడిగేశారు. దానికి వర్మ సమాధానం కూడా చెప్పేశారు.

‘బతికితే వర్మలా బతకాలి అనుకుంటూ ఉంటారు. మరి దాని కోసం ఏం చేయాలి’ అని అలీ అడిగితే… వర్మ మాట్లాడుతూ మూడు విషయాలు వదిలేయాలి అని చెప్పారు. దేవుడు, సమాజం, కుటుంబాన్ని వదిలేస్తే నాలా బతకొచ్చు అని వివరించారు ఆర్జీవీ. మరి ఈ విషయాలు ఆ రోజుల్లో మీ ఫాదర్‌ కూడా అనుకుని ఉంటే మీరు ఇలా ఇప్పుడు ఉండేవారు కాదు కదా అని అలీ అడిగారు. దానికి వర్మ షాకింగ్‌ సమాధానమిచ్చారు. ఇప్పుడు అదే వైరల్‌గా మారింది. ‘మా నాన్నకు తెలివి లేదు కాబట్టి… నేను కూడా తెలివి లేకుండా ఉండాలా?’ అంటూ తిరిగి ప్రశ్నించారు వర్మ.

సినిమా పరాజయాన్ని ఎలా తీసుకుంటారు అని వర్మ అడిగితే… ‘‘నేను ఒక సినిమా చేశాక, ఆ సినిమా ఫలితం గురించి అసలు పట్టించుకోను. దానికి బదులు వేరే సినిమా పనుల్లో పడతాను’’ అని క్లారిటీ ఇచ్చారు వర్మ. అలాగే ఇటీవల కాలంలో బర్త్‌డేలు చేసుకుంటున్నారు ఏంటీ.. కొత్తగా అని అలీ అడిగితే.. ‘‘ఈ మధ్య అమ్మాయిలు నాకు ఎక్కువగా పార్టీ ఇస్తున్నారు. అందుకే పార్టీలు చేసుకుంటున్నా’’ అని క్లారిటీ ఇచ్చారు వర్మ.

దీంతోపాటు ‘వంగవీటి’ సినిమా ప్రచారం సమయంలో జరిగిన ఓ సభలో చోటుచేసుకున్న ఘటనల్ని కూడా ఆర్జీవీ వివరించారు. ఆ కార్యక్రమంలో కొంతమంది ఫ్యాన్స్‌… వాళ్లు పవన్‌ ఫ్యాన్స్‌ అయి ఉండొచ్చు.. నేను మాట్లాడుతుంటే అరవడం మొదలుపెట్టారు. అప్పుడు నేను అరవడం ఆపకపోతే కొడతా అన్నాను అంటూ ఏదో చెప్పారు. అదేంటి అనేది ఎపిసోడ్‌లో తెలుస్తుంది. వచ్చే వారమే ఈ ఎపిసోడ్‌.

Share.