కాంతార సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు కన్నడ హీరో రిషబ్ శెట్టి. కర్ణాటక ఆదివాసీల భూతకోల ఆచార సాంప్రదాయాలను ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి అందరికీ తెలియజేశారు.ఈ సినిమా కన్నడ భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా కోట్లలో కలెక్షన్లను రాబడుతూ ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా హిందీలో కూడా ఏకంగా 54 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టడం విశేషం.
ఈ విధంగా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో హీరో రిషబ్ శెట్టి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఇకపోతే తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన బాలీవుడ్ సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి వందల కోట్ల బడ్జెట్ కేటాయించి సినిమాలు చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నాయి.ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణాలను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేస్తూ పరోక్షంగా మేకర్స్ కు చురకలు అంటించారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ మేము సినిమాలు చేసేటప్పుడు మా కోసం చేయము ప్రేక్షకుల కోసం చేస్తామంటూ వెల్లడించారు. ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తారనే విషయాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తామని తెలిపారు.
ప్రేక్షకుల విలువలు వారి జీవన విధానం ఎలా ఉంటాయో తెలుసుకోవాలి మేము నిర్మాతలు కాకముందు ప్రేక్షకులలో ఉన్నాము అయితే ప్రస్తుతం సినిమాలలో పాశ్చాత్య సంస్కృతి ఎక్కువగా కనపడుతుందని ఈయన తెలియజేశారు. మేకర్స్ ఎక్కువగా హాలీవుడ్ కంటెంట్ తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా ఎందుకు ప్రయత్నించడం అంటూ ఈయన మేకర్స్ కు చురకలు అంటించారు.ఈ విధంగా హాలీవుడ్ కంటెంట్ ఉన్న సినిమాలను చేయటం వల్లే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయంటూ పరోక్షంగా రిషబ్ శెట్టి బాలీవుడ్ సినిమాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.