జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఈయన చిన్నపిల్లలతో కలిసి అద్భుతమైన స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పిస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాకేష్ హీరోగా సినిమాని చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన కేసీఆర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇటీవల సినిమాను ప్రకటించి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకుని నవంబర్ 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాని విడుదల చేయకూడదంటూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. నా సినిమాని నవంబర్ 17వ తేదీ లేదా 24వ తేదీ విడుదల చేయాలని భావించాము. షూటింగ్ పనులు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి మరోవైపు ప్రమోషన్స్ కూడా ప్రారంభించాలి.
ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ నుంచి సినిమాని విడుదల చేయకూడదు అంటూ ఉత్తర్వులు వచ్చాయని ఈయన తెలియజేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలను ప్రేరేపించే విధంగా ఏ రాజకీయ సినిమాలు కూడా విడుదల కాకూడదని ఉత్తర్వులు జారీ చేయడంతో నా సినిమా విడుదల ఆగిపోయిందని ఇందులో ఎవరి ప్రమేయం లేదు అంటూ (Rocking Rakesh) రాకేష్ తెలియజేశారు.
చట్టం ప్రకారమే నా సినిమా విడుదల ఆగిపోయిందని అయితే అది కూడా నా మంచికే జరిగిందని నేను భావిస్తున్నాను. సినిమా మరింత ఆలస్యంగా విడుదల కావడంతో ప్రమోషన్లకు కూడా కొంత సమయం దొరుకుతుంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.