దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేకులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేర్వేరు కారణాల వల్ల ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ రెండుసార్లు మారగా కరోనా కేసుల సంఖ్య పెరిగితే మరోసారి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నెల 13వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావాల్సి ఉంది. దసరా పండుగ సెలవులు కలిసొస్తాయని భావించి ఆ తేదీన రిలీజ్ చేయాలని రాజమౌళి భావించారు.
దసరా పండుగకు రిలీజ్ చేయడం సాధ్యం కాకపోతే మాత్రం 2022 సంక్రాంతికి ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో నటిస్తున్న ఒక యాక్టర్ ఈ సినిమాకు జైలు సన్నివేశం హైలెట్ గా నిలుస్తుందని వెల్లడించారు.అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చరణ్, కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ మధ్య జైలులో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందని ఆ సీన్ ఆర్ఆర్ఆర్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని సమాచారం.
ఈ సినిమాలో కాలభైరవ పాడిన ఎమోషనల్ సాంగ్ కూడా ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గి షూటింగ్ లు మేలో మొదలైతే జూన్ నెలాఖరు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు విడుదలైనా ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారనుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.