‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఈ ఏడాది మార్చి 25న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.1200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 21న(నిన్న) జపాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. జపాన్ వెర్షన్ కోసం రాజమౌళి- ఎన్టీఆర్- రాంచరణ్ లు అలాగే ‘ఆర్.ఆర్.ఆర్’ టీం సభ్యులు జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇందుకోసం ‘ఆర్.ఆర్.ఆర్’ టీం భారీగా ఖర్చు చేస్తుందని వినికిడి. జపాన్ లో రాజమౌళి సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ‘నాటు నాటు’ పాటకి అక్కడి జనాలు ఉత్సాహంతో చిందులు వేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే జపాన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సినిమాని అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది.
సరే ఇంతకీ జపాన్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ టార్గెట్ ఎంత? రాజమౌళి సినిమా కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుని చేతులు దులుపుకోవడం కాదు. రికార్డ్ కొట్టాలి. అప్పుడే అక్కడి జనం గొప్పగా మాట్లాడుకుంటారు. జెనెరల్ క్యాటగిరీలో ఆస్కార్ కు వెళ్లిన ఆర్.ఆర్.ఆర్ కు కూడా ఎంతో కొంత కలిసొస్తుంది. రజనీకాంత్ ముత్తు సినిమా అక్కడ 400 మిలియన్ యెన్లు(జపాన్ కరెన్సీ) కలెక్ట్ చేసింది.
ఒక యెన్ కు మన లెక్కలో 0.56 పైసలు. అంటే రూ.22 కోట్లకు కొంచెం ఎక్కువ అన్న మాట. ‘ముత్తు’ తర్వాత ‘బాహుబలి’ 365 మిలియన్ యెన్లు, త్రీ ఇడియట్స్ 149 మిలియన్ యెన్లు కలెక్ట్ చేశాయి. కాబట్టి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం బిజినెస్ తో సంబంధం లేకుండా అక్కడ 400 మిలియన్ యెన్ లకు పైగా కలెక్ట్ చేయాల్సి ఉంది. మరి ఆ ఫీట్ ను ‘ఆర్.ఆర్.ఆర్’ సాధిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.