దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. లక్షల్లో కేసులు, వేళల్లో మరణాలు సంభవిస్తున్నాయి. వైరస్ సోకిన పేషంట్స్ తో హాస్పిటల్స్ నిండిపోయాయి. కరోనాను ఎదుర్కోవాలంటే సరైన అవాగాహనతో పాటు ధైర్యం కూడా అవసరం. అందుకే సినీ ప్రముఖులంతా కరోనాపై అవగాహన కల్పించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రజల్లో చైతన్య నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ వినూత్న రీతిలో ప్రజలను కోవిడ్ నిర్మూలనలో భాగం కావాలంటూ కోరారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాట్లాడిన వీడియోను యూట్యూబ్ లో #StandTogether పేరుతో రిలీజ్ చేశారు.
అందులో అలియా భట్ తెలుగులో, రామ్‌చరణ్ తమిళంలో, ఎన్టీఆర్ కన్నడలో, రాజమౌళి మలయాళంలో, అజయ్‌దేవ్‌గణ్ హిందీలో మాట్లాడుతూ.. కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తమ సందేశం చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియోను రిలీజ్ చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని.. దీని బారిన పడకుండా ఉండాలంటే మనకున్న ఆయుధాలు మాస్క్, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్, వ్యాక్సిన్ అని..
వీటిని తప్పకుండా పాటించాలని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కోరింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయానికొస్తే.. కరోనా కారణంగా షూటింగ్ ను వాయిదా వేశారు. అయితే దాదాపు షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిందని సమాచారం. ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకున్నారు. మరి చెప్పిన టైమ్ కి వస్తుందో లేదో చూడాలి!