కొణిదెల – అల్లు కుటుంబాల్లో బంధాలు, బంధుత్వాలు, వరసలు, పిలుపులు కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఈ రెండు కుటుంబాల వారసలు దాదాపు ఒకే వయసు వారు కావడంతో, ఎక్కువ సమయం కలిసే గడిపారు. చెన్నైలో ఉన్నా, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసినా కుటుంబాల్లోని పిల్లలు కలిసే ఉంటారు. అందుకే మావయ్య చిరంజీవిని అల్లు అర్జున్ ‘చిట్టి బాబాయ్’ అంటుంటాడు. మేనమామ కూతురు సుస్మితను సాయితేజ్ అక్క అని పిలుస్తుంటాడు. ఎందుకు అని అడిగితే ‘మా ఇంట్లో కజిన్స్ అంతా అన్నా చెల్లెళ్లులాగే పెరిగాం’ అని చెబుతుంటారు కొణిదెల- అల్లు కుర్రాళ్లంతా.
ఇటీవల నిహారిక పెళ్లి సందర్భంగా మొత్తం రెండు కుటుంబాల ‘యువ’ బ్యాచ్ సొంత అన్నదమ్ముల్లా సందడి చేశారు, ఎంజాయ్ చేశారు. ‘సూర్యకాంతం’ అంటూ సాయితేజ్ నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటపట్టించాడు కూడా. ఇద్దరి మధ్య అనుబంధం ఎలాంటిది అంటూ ఇటీవల సాయితేజ్‌ను కదిపితే ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. ‘‘చిన్నప్పట్నుండి నిహారికను చెల్లెలుగానే అనుకునేవాణ్ని. మా ఇంట్లో కజిన్స్ అంతా అన్నా చెల్లెళ్లులాగే పెరిగాం. శ్రీజ, సుస్మిత అక్క… ఇలా మా అందరిదీ అక్కాతమ్ముళ్ల బంధమే’’ అని చెప్పాడు సాయితేజ్.
‘‘నిహారికకి చాలా వరకు మా అమ్మ పోలికలు ఉంటాయని ఇంట్లో అందరూ అంటుంటారు. నిహారికకి అంతా మేనత్త పోలికే అనిపిస్తుంటుంది. అలా నిహారిక మా అమ్మ అన్నమాట. తనని మా అమ్మలాగే చూసుకుంటాం’’ అంటూ నిహారికతో తన రిలేషన్ గురించి చెప్పాడు సాయితేజ్. మరి నీ పెళ్లెప్పుడు సాయితేజ్ అంటే… ‘నా కంటే పెద్దోడు శిరీష్ ఉన్నాడు. వాడు వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటాడు. ఇక నాపెళ్లంటారా… ఇంట్లో పెద్ద కొడుకును కదా కొన్ని పనులు ఉన్నాయి. ముందు వాటిని పూర్తి చేయాలి’’ అని పెళ్లి మ్యాటర్‌ను మళ్లీ హోల్డ్‌లో పెట్టాడు.