మొన్ననే అనుకున్నాం కదా.. ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసినట్టు’ అని..! ఏది మన రష్మిక పేరు చెప్పి ‘పొగరు’ సినిమాని తెలుగులో ఎక్కువ రేట్లకు అమ్మారని..! సరిగ్గా ఇప్పుడు అలాగే ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలు కూడా సైడ్ బిజినెస్ మొదలుపెట్టారు. అదేంటంటే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ‘కె.జి.ఎఫ్’ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్లో కూడా సక్సెస్ సాధించింది ఈ చిత్రం. ఓ కన్నడ చిత్రం ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
అందుకే ‘కె.జి.ఎఫ్2’ చిత్రాన్ని భారీ రేట్లు పెట్టి కొనుగోలు చెయ్యడానికి రెడీ అయ్యారు. అయితే ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలు ఇంకా అత్యాశకు పోయి ఆ సీక్వెల్ కు ఏకంగా 90కోట్లు రేటు చెబుతున్నారట. దీంతో అన్ని చోట్ల వీరి పై వ్యతిరేకత మొదలైంది. సరిగ్గా ఇదే టైములో నిర్మాతలైన ‘హోంబేల్ ఫిలిమ్స్’ వారు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటంటే.. ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని కూడా వీరే నిర్మిస్తున్నారు. దానికి కూడా ప్రశాంత్ నీల్ దర్శకుడన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఒకవేళ ‘కె.జి.ఎఫ్2’ కి కనుక నష్టాలు వస్తే.. వాటిని ‘సలార్’ హక్కులతో రికవరీ చేసుకోవచ్చు అని భరోసా ఇవ్వడం మొదలుపెట్టారట. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు కె.జి.ఎఫ్ చిత్రానికి 90కోట్ల భారీ బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. అంటే వీటిలో డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు కూడా కలిపే అని ఇన్సైడ్ టాక్.