సినిమా ఓ కళ. దాన్ని చదివి నేర్చుకోవడం సాధ్యమా? ఈ డిబేట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ మాటకొస్తే ఎవరికైనా ఐఏఎస్ కావాలంటే మంచి కోచింగ్ సెంటర్‌లో చేరి చదివి అవ్వొచ్చు. కానీ సినిమాని తెరకెక్కించాలంటే కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన సరిపోదు. ఇదే విషయాన్ని ప్రముఖ దర్శకుడు సందీప్ వంగా (Sandeep Reddy Vanga) తనదైన స్టైల్ లో చర్చకు తీసుకొచ్చారు. ఇటీవల ఓ మాజీ ఐఏఎస్ అధికారి చేసిన కామెంట్స్ సందీప్ వంగా మనసుని గాయపరిచాయట.
ఆయన మాటల్ని తలచుకుంటే తాను ఏదో నేరం చేసినట్టు అనిపించిందని, అలాంటి విమర్శలకు అసలు అర్థమే లేదని వంగా స్పష్టంగా చెప్పారు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 12th ఫెయిల్ చిత్రంలో యూపీఎస్సీ ప్రొఫెసర్ పాత్ర పోషించారు. సినిమా ప్రమోషన్ సమయంలో మాజీ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు ఆయన యానిమల్ (Animal) సినిమాను తీవ్రంగా విమర్శించారు.
ఆ సినిమా సమాజానికి అవసరం లేదని, కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా తెరకెక్కించారని విమర్శించారు. సినిమాని డబ్బు కోసమే తీసేలా చిత్రీకరించారంటూ అలాంటి సినిమాలు సమాజానికి పెద్దగా ఉపయోగ పడవని అన్నారు.. ఇక ఆ మాటలకు వంగా (Sandeep Reddy Vanga) తన ఉద్దేశం అది కాదని, కథలకీ, ప్రేక్షకుల అభిరుచికీ మధ్య ఉన్న లింక్‌ని అర్థం చేసుకుని సినిమాలు తీయాల్సి ఉంటుందని చెప్పారు.
అంతేకాదు, ఒక మనిషి ఐఏఎస్ కావాలంటే ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుంటే చాలని, అదే సినిమా తీయాలంటే పుస్తకాలు చదివితే సరిపోదని స్పష్టం చేశారు. సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం అన్నీ అనుభవంతోనే వస్తాయే తప్ప, క్లాసురూమ్‌లో నేర్చుకునే సబ్జెక్టులు కావని, ఈ విషయం ఆ ఐఏఎస్ అధికారికి అర్థం కావాలని సూచించారు. వంగా రియాక్షన్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ విషయంపై ఆ ఐఏఎస్ అధికారి మరోసారి స్పందిస్తారా? లేక వంగా వ్యాఖ్యలే ఫైనల్ గా నిలిచిపోతాయా? చూడాలి.