2026 సంక్రాంతికి ఇంకా టైమ్ ఉంది కానీ, బాక్సాఫీస్ దగ్గర అప్పుడే వేడి మొదలైంది. ఈసారి పండగ బరిలో దిగుతున్న ఇద్దరు దిగ్గజాల బిజినెస్ లెక్కలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు గ్లోబల్ కటౌట్ ప్రభాస్, మరోవైపు టాలీవుడ్ బాస్ చిరంజీవి. వీరిద్దరి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ నంబర్స్ చూస్తుంటే, రాబోయే పొంగల్ ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోంది. బయ్యర్లు కోట్లు కుమ్మరించడానికి రెడీ అయిపోయారు.
SANKRANTHI
ప్రభాస్ నటిస్తున్న కలర్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ మీద బయ్యర్ల నమ్మకం పీక్స్‌లో ఉంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 135 కోట్ల బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ అంచనా. ప్రభాస్ మార్కెట్ పరిధి పెరగడం, అందులోనూ పండగ సీజన్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ భారీ మొత్తాన్ని పెట్టడానికి వెనకాడటం లేదు.
ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కోసం బయ్యర్లు రూ. 105 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఒక సీనియర్ హీరో అయి ఉండి, ఇప్పటికీ అలవోకగా వంద కోట్ల మార్క్ దాటించడం అంటే అది చిరుకే సాధ్యం. బాస్ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఈ బిజినెస్ ఫిగర్స్ ఉన్నాయి. పైగా అనిల్ రావిపూడి సినిమా కాబట్టి ఆ మాత్రం డిమాండ్ ఉండటం సహజమే.
ఈ రెండు సినిమాల బిజినెస్ కలిపితేనే దాదాపు 240 కోట్లు దాటుతోంది. అంటే సంక్రాంతికి థియేటర్ల దగ్గర ఎంత పెద్ద యుద్ధం జరగబోతోందో ఊహించుకోవచ్చు. ప్రభాస్ నంబర్స్ పరంగా లీడ్‌లో ఉన్నా, పండగనాడు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే చిరు సినిమా కూడా రికార్డులు తిరగరాయడం ఖాయం. ఇద్దరూ సేఫ్ జోన్‌లోకి రావాలంటే హిట్ టాక్ పడాల్సిందే, లేదంటే బయ్యర్లకు రిస్క్ తప్పదు.
