కరోనా కారణంగా గతేడాది రావాల్సిన సినిమాలు, ఈ ఏడాదికి వాయిదాకి పడ్డాయి. కొన్ని వచ్చేసినా ఇంకా చాలా సినిమాలు ఉండిపోయాయి. ఈ ఏడాది ఎలాగైనా వచ్చేస్తాయి అనుకున్నారు. ఆ ఊపులో అన్ని సినిమా నిర్మాణ సంస్థలు రిలీజ్‌డేట్లను పెద్ద మేళాలా ప్రకటించేశాయి. దీంతో అభిమానులు ఆనందం డబుల్ అయ్యింది. అయితే మళ్లీ కరోనా వచ్చి పరిస్థితిని మార్చేసింది. రెండో వేవ్ జోరు చూస్తుంటే ఈ ఏడాది కూడా సినిమాలు వచ్చేలా లేవు. ఎప్పుడు కరోనా తగ్గుతుందా అనేది తెలియకపోవడంతో సినిమా తేదీల విషయంలో మళ్లీ డౌట్లు వచ్చాయి.
టాలీవుడ్‌లో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో పెద్ద హీరోల సినిమాల గురించే మాట్లాడుకుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఆచార్య’, ‘అఖండ’, ‘నారప్ప, ‘దృశ్యం 2’,‘రాధే’, ‘‘పుష్ప’, ‘ఎఫ్ 3’ లాంటి సినిమాలున్నాయి. ఇక యవ హీరోల సినిమాలు చూసుకుంటే ‘విరాటపర్వం’, ‘టక్ జగదీష్’, ‘గని’, ‘లైగర్’.. ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఈ ఏడాది షెడ్యూల్ అయిన సినిమాలే. ఇప్పుడు రిలీజ్‌లు ఆగిపోవడంతో వీటిలో ఏవి ఓటీటీకి వెళ్తాయో తెలియడం లేదు. కొన్ని సినిమాలు ఏడాది ఆఖరకు వస్తాయని చెబుతున్నా.. కొన్ని మాత్రం సంక్రాంతికే అంటున్నారు.
ప్రస్తుతం వచ్చే సంక్రాంతికి షెడ్యూల్ అయిన సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’, ‘సర్కారు వారి పాట’ ఉన్నాయి. దీంతో పాటు ‘ఎఫ్ 3’కూడా అప్పుడే అంటున్నారు. సినిమా షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉండటం, డేట్స్ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండటంతో సంక్రాంతే బెటర్ అని దిల్ రాజు అనుకుంటున్నారట. దీంతో సంక్రాంతికి మళ్లీ అల్లుళ్లు వస్తారట. చెప్పడానికి బాగున్నా… పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావడం థియేటర్ల రచ్చకు దారితీస్తుందనేది మన గతంలో అనుభవం ఉంది. కాబట్టి వచ్చే పెద్ద పండగ ఎలా ఉంటుందో చూడాలి.