సినిమా స్టోరీ లైన్ చెప్పాక.. దాంతో హిట్ కొట్టడం అంటే టాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపించే పేరు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తన సినిమా ప్రారంభించిన కొద్ది రోజులకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేస్తుంటారు. కొందరైతే సినిమా రిలీజ్‌కు ఇంకొద్ది రోజులు ఉంది అనగా సమాచారం ఇస్తుంటారు. మరికొందరైతే సినిమా టీజర్ / ట్రైలర్ స్టోరీ లైన్ దాదాపుగా చెప్పేస్తుంటారు. దానిని ఆ తర్వాత నటులు కూడా చెబుతుంటారు.
Saripodhaa Sanivaaram
మేం పైన చెప్పిన ఆఖరి కాన్సెప్ట్.. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమా టీమ్ వాడుతోంది. సినిమా స్టోరీ లైన్ ఇదీ అంటూ.. సినిమాలో కీలక పాత్ర పోషించిన ఎస్.జె.సూర్య (SJ Suryah) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు. అయితే సినిమా ట్రైలర్ చూసినవాళ్లకు ఆ లైన్ అంతర్లీనంగా ఉంది అని అర్థమవుతుంది కూడా. ఈ నేపథ్యంలో కథ ఇదే అయినప్పుడు ‘సరిపోతుందా శనివారం’ అంటూ ఓ చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది.
నాని (Nani) హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఆ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో మాట్లాడుతూ.. ఎస్.జె.సూర్య సినిమా కథను చెప్పారు. ఒక అబ్బాయికి కోపమెక్కువ. అందుకే ప్రతి చిన్న విషయానికి కోప్పడకూడదని అతడికి వాళ్ల అమ్మ చెబుతుంది. అయినా ఆ కుర్రాడు వినడు. దీంతో ఒక షరతు పెడుతుంది అంటూ కథను వివరించే ప్రయత్నం చేశారు.
ఆఖరికి ఇలా కాదని, వాళ్ల అమ్మ ఆలోచించి.. వారంలో ఒక రోజు మాత్రమే తన కోపాన్ని చూపించాలని, మిగిలిన రోజులు శాంతంగా ఉండాలని కొడుక్కి వాళ్ల అమ్మ చెబుతుంది. అందుకు ఆ అబ్బాయి అంగీకరిస్తాడు కూడా. ఆదివారం నుండి శుక్రవారం వరకు సాఫ్ట్‌గా ఉండే ఆ అబ్బాయి.. శనివారం వస్తే మాస్ అయిపోతాడు. దర్శకుడు ఆత్రేయ ఈ పాయింట్ చెప్పగానే కొత్తగా అనిపించి కథను ఓకే చేశానని సూర్య చెప్పారు.