కోవిడ్ కారణంగా పెద్ద సినిమాల షూటింగ్లు ఏడాది వరకు ఆగిపోయాయి. సెకండ్ వేవ్ టైంలో కూడా షూటింగ్లు నిలిచిపోయాయి. దీంతో నిర్మాతల పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. షూటింగ్లు జరగకపోయినా వాళ్ళు కోట్ల రూపాయల వరకు వడ్డీలు కట్టారు. అయితే ఈ పెట్టిన మొత్తాన్ని జనాల నుండీ వసూల్ చేసేద్దామని ప్రయత్నించి ప్రభుత్వాల నుండీ తెచ్చుకున్న టికెట్ రేట్ల అనుమతులు మొదటికే మోసం వచ్చేలా చేశాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన పెద్ద సినిమాలు వారం రోజుల పాటు టికెట్ రేట్ల హైక్ కు అనుమతి తెచ్చుకున్నాయి.
అయితే ఆ టికెట్ రేట్లు సామాన్యులకి ఏమాత్రం అందలేని విధంగా ఉన్నాయి. పెట్టిన బడ్జెట్, కట్టిన వడ్డీలు వారం రోజుల్లో వెనక్కి లాగేద్దాం అనుకుంటే.. ప్రేక్షకులు వాళ్ళకి షాక్ ఇస్తున్నారు. పోనీ టాక్ ను బట్టి అయినా తగ్గిస్తున్నారా? అంటే అదీ లేదు. ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ చిత్ర బృందాలు అదే పని చేశారు. తాజాగా విడుదలైన ‘సర్కారు వారి’ టీం వీళ్ళకంటే అత్యాశకి పోతుందనే చెప్పాలి. నిజానికి సోమవారం నుండీ తెలంగాణలో టికెట్ రేట్లు తగ్గించాలని భావించిన ‘సర్కారు వారి’ టీం..
మరో 3 రోజుల్లో మొదటి వారం ముగుస్తుంది కదా తర్వాత ఎలాగూ టికెట్ రేట్లు తగ్గుతాయి అనే ఉద్దేశంతో చప్పుడు చేయకుండా ఉంది. దీని వల్ల సోమవారం నాడు బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. ‘సినిమా ఓ మాదిరిగా ఉంది’ అనే పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. టికెట్ రేట్లు తగ్గించి ఉంది ఉంటే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే చాలా చోట్ల డెఫిసిట్లు పడడం, షోలు క్యాన్సిల్ అవ్వడం వంటివి చోటు చేసుకున్నాయి. ఆంధ్రాలో ఎలాగూ అందుబాటులో ఉన్న టికెట్ ధరలు కాబట్టి అక్కడ బాగానే బుకింగ్స్ జరుగుతున్నాయి.