ఒకప్పుడు సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్ వస్తే.. బాగుందా, బాగోలేదా? అంటూ విశ్లేషణలు చేసేవారు. బాగుంటే బాగుంది అని చెప్పేవారు, లేదంటే లేదనేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఇలాంటి ప్రమోషనల్ స్టఫ్ రావడం ఆలస్యం… ఇంతముందు ఇదెక్కడో చూశాం, అచ్చంగా ఇలాంటి ఫొటో ఆ సినిమాలో ఉంది, ఈ సీన్ ఆ సినిమా నుండి ఎత్తేశారు లాంటి ప్రశ్నలు, క్వరీలు వినిపిస్తున్నాయి. అలా ‘యానిమల్’ టీజర్ గురించి ఇప్పుడు ఓ చర్చ మొదలైంది.
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా ‘యానిమల్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా విడుదలకు రెండు నెలలు టైమ్ ఉండటంతో టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అది కూడా ఏ పోస్టర్‌తో కాదు ఓ యాక్షన్ వీడియోతో. సినిమా పేరును జస్టిఫై చేస్తూ, సినిమా కాన్సెప్ట్‌ను చెప్పేలా ఈ వీడియోను సిద్ధం చేశారు. ఈ యాభై సెకన్ల వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అని చెప్పొచ్చు. హీరో గొడ్డలి చేతపట్టి మాస్క్‌లు ధరించిన శత్రుమూకను తెగనరికే యాక్షన్ సన్నివేశాలు ఆ వీడియోలు ఉన్నాయి.
ఆ మాస్క్‌లు కూడా మెటల్‌తో పుర్రెల ఆకారంలో చేసినవి కావడంతో ఈ సీన్ ఇంకా వైల్డ్‌గా కనిపిస్తోంది. ఓవైపు పంజాబీ సాంగ్, మరోవైపు రౌడీల మూక, ఇంకోవైపు రణ్‌బీర్ యాక్షన్ మొత్తం కలగలిపి ఈ సీన్ అయితే సినిమాలో అదిరిపోయేలా ఉంది. అయితే ఈ సీన్‌ను ఓ కొరియన్ సినిమా నుండి ఎత్తేశారు అని అంటున్నారు. ‘ఓల్డ్ బోయ్’ అనే కొరియన్ సినిమాలోని కారిడార్ ఫైట్ వీడియోను షేర్ చేస్తూ రెండూ ఒకేలా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే వన్ వర్సెస్ గ్రూప్ ఫైట్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అయితే ఎవరెలా చూపించారు అనేది ఇక్కడ లెక్క. ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగా చాలా బాగానే చూపించారు అనాలి. కానీ ఇలాంటి కాపీ మరకలు టీమ్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తాయి అని చెప్పొచ్చు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 11న సినిమాను విడుదల చేయబోతున్నారు.