‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలోనే మహేష్ బాబుకి శేఖర్ కమ్ముల ఓ కథ వినిపించాడు. అదే ‘ఫిదా’ మూవీ కథ. మహేష్ కు కూడా ఈ కథ బాగా నచ్చింది. కానీ ఓకే చెప్పలేకపోయాడు. తరువాత శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ తో చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ మహేష్ అభిమానులు.. తమ హీరో మంచి హిట్ సినిమాని వదిలేసుకున్నాడే అని మొదట బాధపడినా.. ఆ తరువాత మాత్రం ఈ సినిమా మహేష్ చెయ్యకపోవడమే మంచిదయ్యింది అంటూ కవర్ చేసుకున్నారు.
ఆ సినిమా ప్రమోషన్ టైములో నిర్మాత దిల్ రాజు కూడా ఇదే మాట అన్నాడు. వీటి పై ఇటీవల శేఖర్ కమ్ముల స్పందిస్తూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసాడు. ఆయన మాట్లాడుతూ.. ” ‘ఫిదా’ కథ మహేష్ బాబు ఒప్పుకుంటే కచ్చితంగా చేసేవాడ్ని. ‘ఫిదా’ అనేది లేడీ ఓరియంటెడ్ సినిమానే. నేను ఒప్పుకుంటాను. కానీ మహేష్ కనుక ఒప్పుకుని ఉంటే కచ్చితంగా దాన్ని వేరేలా తెరకెక్కించేవాడిని. కథలో మార్పులు చేసే వాడిని. ఆ ట్యాలెంట్ నాలో ఉంది.
ఓ సినిమాని కమర్షియల్ గా ఎలా హిట్ చెయ్యాలో నాకు తెలుసు. మహేష్ ఒప్పుకుంటే కచ్చితంగా ఫిదా మరోలా ఉండేది. మహేష్ తో పాటు చరణ్ కు కూడా ‘ఫిదా’ కథ వినిపించాను. వాళ్ళు రిజెక్ట్ చేసిన తరువాత వరుణ్ తేజ్ యాక్సెప్ట్ చేసాడు. నాతో ప్రాబ్లం ఏంటంటే.. నేను కథ బాగా చెప్పలేను. నేను కథ చెబుతుంటే హీరోలకు ఆవులింతలు వచ్చేస్తుంటాయి. నన్ను నమ్మి ఒప్పుకోవాలి. మిగతా పార్ట్ అంతా నేను చూసుకుంటాను” అంటూ శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.