సీనియర్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) తన రాజకీయ లక్ష్యం గురించి ఇచ్చిన తాజా ప్రకటనతో తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. “ఎప్పటికైనా తమిళనాడు సీఎం కావాలని కోరిక” అంటూ త్రిష చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ప్రజాసేవకు రాజకీయాలే సరైన వేదిక అని ఆమె అభిప్రాయపడింది. ఇప్పటిదాకా త్రిష తన సినీ కెరీర్ పై మాత్రమే దృష్టి సారించింది. 20 ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న ఈ నటి ఇప్పటికీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
Trisha
అయితే గతంలో రాజకీయాల గురించి ఆమె ఏనాడూ స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఒక్కసారిగా సీఎం పదవిని తన లక్ష్యమని చెప్పడంతో, అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తమిళనాట రాజకీయాలు, సినీ పరిశ్రమ మిళితమైన చరిత్రను కలిగి ఉన్నాయి. ఎంజీఆర్, జయలలిత వంటి ప్రముఖులు సినిమా నుంచి రాజకీయాల్లోకి వెళ్లి అగ్రస్థాయికి చేరుకున్నారు. లేటెస్ట్ గా అగ్ర హీరో విజయ్ (Vijay Thalapathy) రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న వేళ, త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అలాగే విజయ్ కు పోటీగా ప్రత్యర్ధుల పార్టీలలో చేరుతుందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. త్రిష వ్యక్తిగత జీవితం కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. గతంలో వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దవ్వడం, ఆ తరువాత కెరీర్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టడం కనిపించింది. ప్రస్తుతం 40 ఏళ్లు దాటినా త్రిష తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, కొత్త ఛాలెంజ్‌లు స్వీకరిస్తోంది.
అయితే, రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ఆమె సిద్ధమా? ఈ ప్రశ్న ఇప్పుడు తమిళ పరిశ్రమలో వేడిగా మారింది. త్రిష వ్యాఖ్యల నేపథ్యంలో, ఆమె అభిమానులు, రాజకీయ విశ్లేషకులు ఈ ప్రకటనను విభిన్నంగా అర్థం చేసుకుంటున్నారు. త్వరలోనే ఆమె రాజకీయ ప్రస్థానం మొదలవుతుందా లేక ఈ వ్యాఖ్యలు భవిష్యత్తుకు సంకేతమా అనేది చూడాల్సి ఉంది.