కొడుకు గురించి గొప్పగా చెప్పే అవకాశం వచ్చినప్పుడు, చెబుతున్నప్పుడు తండ్రి ముఖంలో ఓ తెలియని వెలుగు కనిపిస్తుంది అంటారు. దీనిని లైవ్‌లో చూశారు. మీరు కూడా యూట్యూబ్‌లో ఓ లుక్కేయొచ్చు కూడా. ఆ ఆనందం కనిపించిన తండ్రి శివ కుమార్ కాగా, ఆ ఆనందాన్ని ఇచ్చిన తనయుడు సూర్య. అవును ప్రముఖ తమిళ హీరో సూర్య (Suriya) గురించే చెబుతున్నాం. ఆయన హీరోగా కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraj) రూపొందించిన ‘రెట్రో’ సినిమా ఆడియో విడుదల ఇటీవల చెన్నైలో జరిగింది. ఆ వేదిక మీదే సూర్య గురించి శివ కుమార్ భావోద్వేగంతో మాట్లాడారు.
ఆడియో రిలీజ్‌కి ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్య తండ్రి, నటుడు శివకుమార్ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్య ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చాడనిచ కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తన తనయుడి ఘనత గురించి చెబుతూ చాలా ఆనందించారు. సూర్య ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఒకానొక సమయంలో నాన్‌స్టాప్‌గా నాలుగు గంటల పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు అని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు శివ కుమార్.
సూర్య తెల్లవారుజామున నాలుగుకే నిద్ర లేచి బీచ్‌కు వెళ్లి స్టంట్స్ నేర్చుకునేవాడని కూడా చెప్పారు శివ కుమార్. సూర్య కంటే ముందు కోలీవుడ్‌లో ఎవరూ సిక్స్ ప్యాక్ చేయలేదని శివ కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సినిమాల కోసం అలాంటి బాడీ ట్రై చేసిన మొదటి వ్యక్తి మా అబ్బాయి అని నేను గర్వపడుతున్నా అని శివ కుమార్ తెలిపారు. ఆ మాటలు వింటూ సూర్య ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ‘రెట్రో’ సినిమా మే 1న విడుదల కానుంది. ఇందులో నటిస్తున్న సూర్య, పూజా హెగ్డేతో (Pooja Hegde) పాటు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజుకు కూడా ఈ సినిమా ఫలితం చాలా కీలకం. ముగ్గురికీ సరైన విజయాలు వచ్చి చాలా కాలమైంది.