క్రికెటర్ల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించడం మనకు తెలిసిందే. బయోపిక్‌ల రూపంంలో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అలాగే సినిమా పాటల స్టెప్పులు, డైలాగ్‌లను క్రికెటర్లు మైదానంలో చేసి.. వావ్ అనిపిస్తున్నారు. భలే చేశాడో మా వోడు అనేలా… స్టెప్పులు అదిరిపోతున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో ఇలా క్రికెటర్ల నోట వినిపించిన డైలాగ్ ‘జూకేగా నై’ అదేనండీ మన ‘తగ్గేదేలే’. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ భలే వైరల్ అయిపోయింది.
ఫ్రాంచైజీ లీగ్‌లు, ఇరు దేశాల టోర్నీలు… ఇలా ఎక్కడ చూసినా ‘జూకేగా నై’ అనైనా అంటున్నారు, ‘శ్రీవల్లీ’ స్టెప్ అయినా వేస్తున్నారు. ఇలా డ్యాన్స్‌లు కట్టి, డైలాగ్‌లు చెప్పిన క్రికెటర్లలో రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మెహదీ హసన్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా ‘పుష్ప’గా మారి అలరించారు. డైలాగ్‌లు చెప్పడం, శ్రీవల్లి స్టెప్పులు వారి వేయడం చూసి అభిమానులు మురిసిపోయారు.
ఇప్పుడు ఏకంగా భారత క్రికెట్ బాస్ సౌరబ్ గంగూలీ కూడా ‘పుష్ప’రాజ్‌గా మారిపోయాడు. బంగ్లాలో ప్రసారమవుతున్న ఓ టీవీ షోకి దాదా హోస్టింగ్ చేస్తున్నాడు. ‘దాదా గిరి అన్ లిమిటెడ్’ అనే ఆ కార్యక్రమంలో ‘శ్రీవల్లీ..’ పాట సిగ్నేచర్ మూమెంట్‌ను గంగూలీ చేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కార్యక్రమానికి పుష్ప అనే కుర్రాడు వచ్చాడు. చురుకైన ఆ కుర్రాడితో దాదా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ పిల్లాడు ‘జూకేగా నై’ అంటూ ‘పుష్ప’ డైలాగ్ చెప్పి అలరించాడు.
ఆ తర్వాత ‘శ్రీవల్లీ..’ పాట ప్లే చేస్తే… అందులో హుక్ మూమెంట్ చేసి చూపించాడు. ఆ తర్వాత పిల్లాడితోపాటు గంగూలీ కూడా ఆ స్టెప్పేశాడు. దీంతో దాదా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆ వీడియో చూసి మురిసిపోతున్నారు. దాదా లాంటి గొప్ప క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు అలా డ్యాన్స్ వేయడం వావ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.