తమిళ సినీ పరిశ్రమలో గతకొద్ది రోజులుగా వరుస విషాద సంఘటనలు జరుగుతున్నాయి..రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, ఆరోగ్య పరిస్థితుల వల్ల సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్లు చనిపోతున్నారు.. ఇప్పుడు తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది..తమిళ ఇండ్రీస్టీలో సహాయక నటుడిగా నటించిన నటుడు దీనస్థితిలో మరణించడం తమిళ ఇండ్రీస్టీని విషాదంలోకి నెట్టింది. విచిత్ర సోదరులు’ సినిమాలో కమలహాసన్‌తో కలిసి నటించిన మోహన్(55) అనే సహాయనటుడు మృతి చెందాడు. అయితే ఈయన మరణం అనుమానాస్పదంగా మారింది.
తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం పెరియ రథం వీధి సమీపంలోని వెళ్లింగిండ్రు వద్ద ఓ మృతదేహం పడివున్నట్లు మంగళవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసుల విచారణలో ఆ మృతదేహం సేలం జిల్లా మేటూర్ గ్రామానికి చెందిన సహాయ నటుడు మోహన్‌ది అని తేలింది. (Actor) మోహన్.. ‘విచిత్ర సోదరులు’ చిత‍్రంలో కమల్‌తో కలిసి నటించాడు.
ఈ సినిమాతో పాటు నాన్ కడవుల్, అదిశయ మనిదర్‌గళ్ తదితర తమిళ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. అయితే సేలంకి చెందిన మోహన్.. మధురై ప్రాంతానికి ఎందుకు వెళ్లాడు? అతని మరణానికి కారణాలేమిటి? అనే విషయాల గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మోహన్ మృతి చెందిన విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అయితే సినిమా అవకాశాల కోసమే మోహన్ మధురై వచ్చాడని, ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలీక కొన్నాళ్ల నుంచి వీధుల్లో భిక్షాటన చేసుకుంటున్నాడని, అలా పేదరికం, అనారోగ్య సమస్యల వల్లే చనిపోయాడని అంటున్నారు. ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.