పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజి’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 25 న విడుదల కాబోతున్న ఈ సినిమాకి.. ఈరోజు రాత్రి నుండి అంటే సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటల నుండి ప్రీమియర్ షోలు వేస్తున్నారు. సో ‘ ‘ఓజి’ ఫలితం ఏంటి?’ అనే సస్పెన్స్ కూడా కొన్ని గంటల్లో తీరిపోతుంది.
గ్లిమ్ప్స్ తో సినిమాకి కావాల్సినంత బజ్ వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ వంటివి ఆ హైప్ ను రెట్టింపు చేశాయి. అంతా ఓకే.. కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులను ఒకింత టెన్షన్ పెడుతున్నాయి అని చెప్పాలి. అవేంటనేది హెడ్డింగ్ కరెక్ట్ గా చూసిన వాళ్లలో చాలా మందికి క్లారిటీ వచ్చేసి ఉండొచ్చు. అయినప్పటికీ అర్ధం కానివాళ్ళ గురించి ఇప్పుడు ఆ ప్రశ్నలు ఏంటన్నది చెక్ చేసుకుని క్లారిటీ తెచ్చుకుందాం రండి.
ముందుగా ‘ఓజి’ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన గత చిత్రం ‘సాహో’ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. హిందీలో అయితే ఈ సినిమా సూపర్ హిట్. అందులో డౌటే లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ కి ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చింది. ఎందుకంటే ‘సాహో’ స్క్రీన్ ప్లే తెలుగు ప్రేక్షకులకు అర్ధం కాలేదు. వాళ్ళ సహనానికి చాలా పెద్ద పరీక్ష పెట్టింది. ఇలాంటి స్క్రీన్ ప్లే గతంలో మనం మహేష్ బాబు- సుకుమార్..ల ‘1 నేనొక్కడినే’ లో చూశాం.
‘హీరో లక్ష్యం ఏంటి? హీరో పోరాటం ఎవరితో?’ ఈ ప్రశ్నలకు ఓ క్లారిటీ లేకుండా రెండున్నర గంటలు సినిమాని నడిపించడం అనేది చాలా పెద్ద రిస్క్. ‘1 నేనొక్కడినే’ ఫలితం తర్వాత సుకుమార్ ‘స్టార్ హీరోతో సినిమా ఎంత జాగ్రత్తగా తీయాలి?’ అనే అంశం గట్టి క్లారిటీ తెచ్చుకున్నాడు. ‘సాహో’ తర్వాత సుజిత్ కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడా? అంటే ‘ఓజి’నే సమాధానం చెప్పాలి.
సుజిత్ తన సినిమాల టీజర్, ట్రైలర్స్ ను అద్భుతంగా కట్ చేస్తాడు. కాబట్టి ‘ఓజి’ టీజర్, ట్రైలర్స్ తో వచ్చిన పాజిటివిటీని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని పాజిటివ్ గా ఊహించుకోవడం కూడా తొందరపాటు అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కి సుజిత్ వీరాభిమాని కాబట్టి.. కచ్చితంగా స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు అనే కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువ మంది అభిమానుల్లో కనిపిస్తుంది. వారి నమ్మకమే నిజమవ్వాలని కోరుకుందాం..!