బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కి దక్షిణాదికి చెందిన దర్శకులపై గురి ఉంది. ముఖ్యంగా తెలుగు దర్శకులతో పనిచేయాలనే కుతూహలం కూడా అతనిలో ఎక్కువగా కనిపిస్తుంది అని బాలీవుడ్ మీడియా వర్గాలు చెప్పుకొచ్చాయి. ఇటీవల ఓ వేడుకలో షారుఖ్ ఖాన్.. టాలీవుడ్ హీరోలను, తమిళ హీరోలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కూడా అందరికీ గుర్తుండే ఉంటాయి. ‘డాన్స్ విషయంలో మీ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఆ ఒక్క విషయంలో నా కోసం తగ్గండి’ అంటూ చమత్కరిస్తూనే ప్రశంసించారు షారుఖ్.
ఇక ‘జవాన్’ (Jawan) సినిమాతో షారుఖ్ ఖాన్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ ను అందుకున్న సంగతి తెలిసిందే. దాని దర్శకుడు అట్లీ (Atlee Kumar) సౌత్ కి చెందినవాడే. కొంచెం గతంలోకి షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీ హిట్ సినిమా ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ మొత్తం సౌత్ ఫ్లేవర్ తోనే నిండి ఉంటుంది. అందుకే షారుఖ్ సౌత్ దర్శకులపై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. ఇదిలా ఉండగా.. గత 2,3 రోజుల నుండి సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో షారుఖ్ ఒక సినిమా చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.
ఇటీవల సుకుమార్ ని ఆయన ముంబై పిలుచుకుని మాట్లాడారని, ఈ క్రమంలో సుకుమార్ తన వద్ద ఉన్న లైన్ చెబితే ఇంప్రెస్ అయ్యారు’ అంటూ ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి సుకుమార్ ముంబై వెళ్ళింది లేదు అనేది అతని టీం సమాచారం. సుకుమార్ కి టాలీవుడ్ హీరోలతోనే సినిమాలు చేయాలని ఉందని.. వేరే భాషల హీరోలపై అతను ఆశపడటం లేదు అని స్పష్టమవుతుంది.