డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న రంగస్థలం 1985 సినిమా జోరుగా షూటింగ్ సాగుతోంది. రాజమండ్రిలోని అందమైన ప్రాంతంలో రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈమూవీ, ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ మూవీ టైటిల్ చూడగానే ఇదేదో నాటకాల నేపథ్యంలో సాగుతుందని భావిస్తున్నారు. ఆర్ట్ ఫిలిం అని అనుకునేవారు లేకపోలేదు. వారందరికీ సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. ” రంగస్థలం అంటే నాటకం కాదు.. పల్లెటూరు. ఓ పల్లెటూరి కథే రంగస్థలం.” అని వివరించారు. ఈ స్టోరీ కి స్ఫూర్తి తమ పల్లెటూరే అని చెప్పారు.
“‘ఆర్య’ విడుదల తర్వాత బన్ని మా ఊరికి వచ్చాడు. మా ఊరికి అప్పుడు బస్సు లేదు.. ఇప్పటికీ లేదు. మా ఊరు చూసి బన్ని షాక్ అయిపోయాడు. ఇంత పల్లెటూరి నుంచి వచ్చి, నువ్వు సినిమాల్లో ఉంటావా? అని ఏడిపించేవాడు. దాదాపు పాతికేళ్లు మా ఊరి మట్టిలోనే ఉన్నాను. ఓ పల్లెటూరి సినిమా తీయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. కుదరలేదు. ఎలాగైనా నా సినిమా తీయాలి.. నన్ను నేను వెతుక్కోవాలని తీస్తున్న సినిమా ఇది’ అని అసలు విషయాన్నీ బయటపెట్టారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్న రంగస్థలం 1985 డిసెంబర్ లో రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.