టాలెంటెడ్ హీరో సూర్య (Suriya) కంగువ (Kanguva) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని నార్త్ లో విస్తృతంగా ప్రమోట్ చేస్తూ బాలీవుడ్‌లో సక్సెస్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సూర్య, తన క్రేజ్‌కు బూస్ట్ ఇచ్చిన విక్రమ్ (Vikram) సినిమాలోని రోలెక్స్ పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సూర్య మాట్లాడుతూ, రోలెక్స్ పాత్రలో నటించడం తనకు ఒక ప్రత్యేకమైన అనుభవంగా మారిందని, ఈ పాత్రకు ఏ స్క్రిప్ట్ కూడా ఇవ్వలేదని తెలిపారు.
Suriya
సెట్‌లో చేరిన తర్వాతే సీన్ వివరాలు చెప్పారు. “ఆ రోజు సీన్ కోసం తగినట్లు ఆరెంజ్ లైట్, పొగ, విజువల్స్ అన్నీ అందంగా సిద్ధం చేశారు. ఆ సీన్ తీసే క్రమంలో నా పాత్రలో విలనిజాన్ని చూపించే ప్రయత్నంలో స్మోక్ చేశాను. నేను ఎప్పటికీ తెరపై పొగ త్రాగనని నిర్ణయించుకున్నా, ఈ పాత్ర కోసం ఆ నియమాన్ని అతిక్రమించాను,” అని సూర్య చెప్పారు. ఇంతకాలం తాను బాగా జాగ్రత్తగా పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నానని, కానీ ఈ సారి పాత్రలోకి వెళ్లి సూర్యగా కాకుండా రోలెక్స్‌గా నటించానని చెప్పారు.
సీనియర్ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రొడక్షన్‌లో నటించడం తన కల సాకారమవ్వడంతో పాటు, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం టేకింగ్ కు మరో ఎత్తుగడ అని భావిస్తున్నట్లు తెలిపారు. రోలెక్స్ పాత్ర కోసం ప్రత్యేకమైన ప్రిపరేషన్ చేయకుండానే, ఆ పాత్రలో పూర్తి స్థాయి ప్రతిభను చూపినట్లు చెప్పుకొచ్చారు.
ఈ రోలెక్స్ పాత్రపై ఓ సోలో సినిమా చేయాలనే ఆలోచన ప్రస్తుతం మరింత బలపడిందని సూర్య అన్నారు. ఇక సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ కంగువ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు లోకేష్ రజినీకాంత్ తో కూలి అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా అనంతరం రోలెక్స్ ప్రాజెక్టు పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.