విజయాలు ఎప్పుడూ ఒంటరిగా రాదు వివాదాలను, విమర్శలను వెంట తీసుకొస్తాయని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో మరో మారు నిరూపితమైంది. బాహుబలి:బిగినింగ్ లో అమరేంద్ర బాహుబలిగా నటించి, ప్రపంచం మొత్తం మీద పేరు తెచ్చుకున్న డార్లింగ్ కి రీసెంట్ గా అరుదైన గౌరవం లభించింది. బ్యాంకాక్ లోని టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు ప్రభాస్ మైనపు బొమ్మని తమ మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ఏ నటుడికి దక్కని ఈ గౌరవం.. ప్రభాస్ దక్కినందుకు సంతోషించాల్సింది పోయి .. తమిళనాడుకు చెందిన కొన్ని పత్రికలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎంజిఆర్, శివాజీ గణేశన్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి ఎంతో మంది సీనియర్ నటులు ఉండగా కుర్ర హీరోని ఎంపిక చేయడంపై నిప్పులు కక్కు తున్నాయి. ఇది ఒక రకంగా సీనియర్లను అవమాన పరిచి నట్లేనని కథనాలను ప్రచురిస్తున్నాయి. ఇక అక్కడి నటులలో ప్రభాస్ విగ్రహం ఏర్పాటుపై మిశ్రమ స్పందన వస్తోంది. రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ విగ్రహాలను ఏర్పాటు చేయాలనీ కొంతమంది చెబుతుంటే.. మరికొంతమంది ప్రభాస్ కి మద్దతు తెలుపుతున్నారు. దక్షిణాది నటులకు గేట్లను తీసిన నటుడిగా ప్రభాస్ నిలిచాడని కుష్బూ పాజిటివ్ గా స్పందించారు. మరికొన్ని రోజుల పాటు అమరేంద్ర బాహుబలి మైనపు బొమ్మపై తమిళ మీడియాలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.