సహజత్వంతో కూడిన సినిమాలు చేయడం మంచిదనే తన అభిప్రాయాన్ని నటుడు చిరంజీవికి నేరుగా చెబుదామని ప్రయత్నించినా ధైర్యం చాలకో, అదే సమయంలో వేరే టాపిక్ గురించి మాట్లాడడం వల్లనో చెప్పలేకపోయానని దర్శక- నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ చిరంజీవి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పట్లో.. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వారికి పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదని పేర్కొన్నారు.
ఇప్పటికీ సినిమాపై ప్రేమ ఉన్నవాళ్లు ఉన్నా.. దాన్ని వ్యాపారంగా చూసే వాళ్లే ఎక్కువ అని అన్నారు. సినిమా తీయాలనే ఉద్దేశంతో కథ చెప్పమని అడిగితే ఒకప్పటి రచయితలు సూటిగా చెప్పేవారని, ఇప్పటివారిని అడిగితే ‘ఓపెన్ చేస్తే.. టాప్ యాంగిల్ షాట్’ అంటూ ఎలివేషన్లు ఇస్తున్నారని, దర్శకులే రచయితలు కావడం అందుకు ఓ కారణమన్నారు. ‘‘ప్రేక్షకులకు పనికొచ్చే ఏదో ఒక అంశం సినిమా కథలో ఉండేలా చూడాలి.
అది కూడా సహజంగా ఉండాలి. అది పక్కనపెట్టి ఏదో చేయాలనుకుంటే సినిమాలు పెద్దగా ఆడడంలేదు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోలంతా కెరీర్ ప్రారంభంలో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది. చిరంజీవి నటించిన ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’, ‘విజేత’లాంటి సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కింది. ఆమిర్‌ఖాన్ నటించిన ‘దంగల్’లాంటి నేచురల్ ఫిల్మ్‌లో చిరంజీవి (Chiranjeevi) నటించినా ప్రేక్షకులు చూస్తారు.
‘భోళాశంకర్’, అంతకు ముందు ‘లూసీఫర్’ రీమేక్‌లాంటివి చేసి నిరుత్సాహపడడం కంటే నేచురల్ సినిమాలు చేయడం మంచిదనేది నా అభిప్రాయం. ఇదే విషయాన్ని నేరుగా ఆయనతో చెబుదామని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మెథడ్ యాక్టింగ్ వల్లే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఒకప్పటి సినిమాల్లో ఆయన.. మన కుటుంబంలో ఓ వ్యక్తిగా కనిపించేవారు. ఆ చిరంజీవి కనిపిస్తే మళ్లీ సినిమా ఆడుతుందని నా నమ్మకం’’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!