తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ వ్యవహారంపై స్పందించిన మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక బన్నీ అరెస్ట్ అనంతరం చట్టం తన పని తాను చేసుకుపోతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ ప్రకటనపై పలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Allu Arjun
ప్రస్తుతం జరుగుతున్న ఈ అరెస్ట్ వ్యవహారంలో సీఎం ప్రమేయం ఉందా లేదా అనే అంశంపై చర్చ సాగుతోంది. చట్టపరమైన నిర్ణయాలు పూర్తిగా అధికారుల చేతిలోనే ఉంటాయన్నప్పటికీ, ఇలాంటి సున్నితమైన కేసులు ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతాయా? అనే సందేహం వ్యక్తమవుతోంది. రాజకీయ విశ్లేషకులు ఈ అరెస్ట్ రాజకీయ పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సినీ ఇండస్ట్రీలో రేవంత్ రెడ్డిని అంతగా సీరియస్‌గా తీసుకోవడం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీపై రేవంత్ చేసిన విమర్శలు, అభిప్రాయాలు పెద్దగా ప్రభావం చూపలేదని, దీన్ని ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ అరెస్ట్ కేసు చుట్టూ చర్చలు మరింత ఉధృతమవుతున్నాయి. ఇది కేవలం చట్టపరమైన చర్యగా చూడాలా, లేక ఇందులో రాజకీయ కోణం ఉందా అనే విషయంపై స్పష్టత రాకపోవడం మరో పెద్ద ప్రశ్నగా మారింది.
ఇక అల్లు అర్జున్ అభిమానులు ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయనకు అన్యాయం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఈ కేసు రాజకీయ ప్రభావంతోనే తేలుస్తారా లేక చట్టం తన పని తాను చేసుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.