గత రెండుమూడేళ్లలో తెలుగులో విడుదలై సంచలన విజయాలు సొంతం చేసుకొన్న సినిమాలు చూస్తే ఒక విషయం అర్ధమవుతుంది. 2016లో విడుదలైన “పెళ్ళిచూపులు”, 2017లో విడుదలైన “అర్జున్ రెడ్డి”, నిన్న విడుదలై సంచలనం సృష్టిస్తున్న “నీదీ నాదీ ఒకే కథ” వంటి అన్నీ సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే.. సినిమాలు ఘన విజయం సాధించడమే కాక జనాల మన్ననలు అందుకొన్నాయి. అన్నీ సినిమాలు చాలా సహజంగా ఉంటాయి, అన్నీ సినిమాల్లో సంగీతం చార్ట్ బస్టర్ గా నిలవడంతోపాటు సినిమాలోని పాత్రలన్నిటికీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఈ మూడు సినిమాల్లో ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంది, అదేంటంటే మూడు సినిమాల దర్శకులు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కి చెందినవారు కావడం విశేషం. “పెళ్లిచూపులు” దర్శకుడు తరుణ్ భాస్కర్, “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, “నీదీ నాదీ ఒకే కథ” చిత్రాన్ని తెరకెక్కించిన వేణు ఉడుగుల, ఈ ముగ్గురూ వరంగల్ కి చెందినవారే. ఇదివరకూ ఇండస్ట్రీలో ఆంధ్రుల డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే వాదనలు వినపడిన తెలుగు చిత్రసీమలో ఈ విధంగా తెలంగాణ ప్రాంత దర్శకులు సంచలనాలు సృష్టిస్తుండడం గమనార్హం.