టాలీవుడ్ లో ‘కొత్త బంగారు లోకం’ (Kotha Bangaru Lokam) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్వేత బసు ప్రసాద్ (Shweta Basu Prasad) ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. అయితే, తన కెరీర్ లో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ఊప్స్ అబ్ క్యా’ ఫిబ్రవరి 20న విడుదల కానుండగా, ప్రమోషన్స్‌లో భాగంగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అందులో ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్స్‌లో ఎదుర్కొన్న అవమానం గురించి వెల్లడించడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.
శ్వేత తన హైట్ గురించి ఒక హీరో సెట్స్‌లో ఎప్పుడూ కామెంట్స్ చేస్తూ, తనను తక్కువగా చూపేలా మాట్లాడేవాడని వెల్లడించింది. “నా ఎత్తు 5.2 అడుగులు.. కానీ ఆ హీరో 6 అడుగులుగా ఉంటాడు. సెట్స్ లో ప్రతిరోజూ నా ఎత్తు గురించి కామెంట్స్ చేసేవారు. ‘ఇంత ఎత్తు తేడా ఎలా వర్కౌట్ అవుతుందో’ అంటూ ఎగతాళి చేసేవారు” అని చెప్పింది. ముఖ్యంగా ఆ హీరో తన నటనపై చూపిన వివక్ష, అనవసరమైన రీటేక్స్, తనను అసహనానికి గురిచేశాయని పేర్కొంది.
తనకంటే ఎక్కువగా ఆ హీరోకే తెలుగు సరిగ్గా రాదని, కానీ తన డైలాగ్ డెలివరీని సరిచెప్పే హక్కుతో సెట్లో ఉన్నట్లు ప్రవర్తించేవాడని ఆమె చెప్పింది. “నేను తెలుగు అమ్మాయి కాదు కానీ, సరిగ్గా డైలాగ్స్ చెప్పడానికి కష్టపడేదాన్ని. కానీ అతనికి తెలుగే సరిగ్గా రావడం లేదు. అయినా నా మీదే ఫోకస్ పెట్టేవారు” అని చెప్పుకొచ్చింది. ఈ అనుభవం తనకు చాలా బాధను కలిగించిందని, టాలీవుడ్‌లో నటించిన ఏ సినిమా సెట్లోనూ ఇంత బాధ కలిగించే పరిస్థితిని ఎదుర్కోలేదని చెప్పింది.
అయితే, ఏ సినిమాలో తనకు ఈ అనుభవం ఎదురయ్యిందో మాత్రం చెప్పలేదు. అయినా, కొత్త బంగారు లోకం తర్వాత ఆమె నటించిన రైడ్ (Ride), కాస్కో, కలవర్ కింగ్ (Kalavar King), ప్రియుడు, జీనియస్ వంటి సినిమాల్లో ఏదో ఒకటి కావొచ్చనే ఊహాగానాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో టీవీ షోస్, వెబ్ సిరీస్‌లలో బిజీగా ఉన్న శ్వేతా, తమిళంలో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు టాక్.