ఆ మధ్య పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించి వరుస పుకార్లు, వార్తలు, విషయాలు వచ్చేవి. దీంతో పవన్ సినిమాలు ఇప్పుడు కాకపోతే మరికొద్ది నెలల్లో చూస్తాం అనే నమ్మకం ఉండేది ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు. అయితే ఇప్పుడు హఠాత్తుగా సినిమాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. లీకులు లేవు, టాక్‌లు లేవు. కారణం రాజకీయాలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మరో క్లారిటీ వచ్చేసిందట ఆయా సినిమాల నిర్మాలకు.
పవన్ కల్యాణ్ గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఏదో రూపంలో ఆయన ప్రజల మధ్యనే ఉంటున్నారు. మధ్యమధ్యలో సినిమాలు చేసుకుంటున్నారు. అయితే ఆ మధ్య వరుసగా సినిమాలే చేస్తారు అని చెప్పారు. దీంతో నిర్మాతలు చాలామంది అడ్వాన్స్‌లు ఇచ్చేశారు. గతంలో అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలు హమ్మయ్య సినిమా మొదలవుతుంది అనుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మళ్లీ వాళ్లందరూ వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ విషయం ఆ నిర్మాతలకు కూడా తెలిసినట్లుంది.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పవన్ సినిమాలు చూస్తే… చాలా నెలలుగా ‘హరి హర వీరమల్లు’ సినిమా సెట్స్ మీదనే ఉంది. కొత్త షెడ్యూల్ ఇప్పట్లో స్టార్ట్ అవ్వదు అని చాలా నెలలుగా విన్నాం. ఆ తర్వాత ప్రారంభించిన సినిమాలు కూడా విడుదలైపోయాయి. ఆ సినిమా సంగతి పక్కనపెడితే ఉన్నవి ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’. ఈ సినిమాలు ఆ మధ్య చాలా వేగంగా షూటింగ్ జరుపుకున్నాయి. దీంతో త్వరలో రిలీజ్ డేట్ వింటాం అని కూడా అన్నారు.
అయితే పవన్ (Pawan Kalyan) మళ్లీ పొలిటికల్ పడవ ఎక్కేశాడు. తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలసి పోటీ చేయడంతో ప్రచారానికి వచ్చేశాడు. ఆ పని అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంగతి గురించి సీరియస్‌గా ఉన్నాడట. అక్కడ పొత్తులు, ప్రచారాల చర్చలు నడుస్తుననాయట. ఈ నేపథ్యంలో ఇప్పట్లో పవన్ ముఖానికి రంగేసుకోవడం అసాధ్యం అని తెలుస్తోంది. దీంతో ఆ సినిమాల సంగతి కొన్నిరోజులు పక్కనపెట్టేద్దాం అని నిర్మాతలు అనుకుంటున్నారని సోషల్ మీడియా టాక్.