పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్'(The RajaSaab). నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్..లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్.కె.ఎన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ‘రెబల్ సాబ్’ సాంగ్, ‘సహానా’ సాంగ్, ‘నాచే నాచే’ సాంగ్, సెకండ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. దీంతో జనవరి 9న రిలీజ్ కానున్న ‘ది రాజాసాబ్’ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. జనవరి 8 సాయంత్రం నుండే ప్రీమియర్ షోలు కూడా పడనున్నాయి. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ ‘ది రాజాసాబ్’ ని ప్రభాస్ తన ఫ్రెండ్స్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకు చూపించడం జరిగింది.

సినిమా చూసిన తర్వాత వారు కూడా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.వారి టాక్ ప్రకారం.. ‘ది రాజాసాబ్’ చిత్రం 2 గంటల 58 నిమిషాల నిడివి కలిగి ఉందట. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడట. ఓ ఫైట్ సీన్ తో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట. ఫ్యాన్స్ కి అది మంచి ఫీస్ట్ ఇస్తుందని అంటున్నారు. ఆ వెంటనే ‘రెబల్ సాబ్’ సాంగ్ వస్తుందట. కొన్ని కామెడీ సీన్ల తర్వాత అసలు కథ మొదలవుతుందట.
నానమ్మ.. ఎందుకు తాత పేరు చెప్పగానే కంగారు పడుతుంది అనే ప్రశ్నతో.. హీరో ఓ పాడుబడ్డ బంగ్లాకి వెళ్లడం.. ఆ తర్వాత అతనితో పాటు హీరోయిన్లు, కమెడియన్లు కూడా వెళ్లడం..జరుగుతుందట. ఇంటర్వెల్ సీన్ ని దర్శకుడు మారుతీ బాగా రాసుకున్నాడట. సెకండాఫ్ స్టార్టింగ్ నుండి వచ్చే మాయలు వంటివి ఆకట్టుకుంటాయట. హాస్పిటల్ సీన్, క్లైమాక్స్ అలరిస్తాయని అంటున్నారు. మరి ప్రీమియర్ షోల నుండి ఎలాంటి టాక్ ను రాబట్టుకుంటుందో చూడాలి.
