‘ది రాజా సాబ్’ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేశారు? ఇదేం ప్రశ్న మొన్నీమధ్యే సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు కదా ‘జనవరి 9న సంక్రాంతి గిఫ్ట్‌గా తీసుకొస్తున్నాం’ అని అంటారా. అవును మీరు చెప్పింది నిజమే కానీ.. ఆ రిలీజ్‌కి మూడు నెలలకుపైగా ఉంది కదా.. ఇప్పుడెందుకు సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసినట్లు అనేదే ప్రశ్న. మీకూ ఇదే డౌట్ వచ్చింది. ఈ సినిమా టైమ్‌లైన్‌ను చూసేవాళ్లకు ఎవరికైనా ఇదే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్‌కు మూడు నెలల ముందు ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది చాలా అరుదు.
కానీ ‘ది రాజా సాబ్’ సినిమా టీమ్ ఇప్పుడు ఈ పని చేస్తోంది. ఎందుకు, ఏంటి అనే ఆరా తీస్తే కొన్ని ఆసక్తికర సమీకరణాలు వినిపిస్తున్నాయి. అవి గతంలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు చర్చలోకి వచ్చిన అంశాలే కావడం గమనార్హం. ‘ది రాజా సాబ్’ విషయంలో తొలుత పెద్ద అంచనాలే ఉండేవి. అయితే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ లేకపోవడం, సినిమా షూటింగ్ జరుగుతుందన్న విషయం కూడా బయటకు రాకపోవడంతో అంచనాలు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో సినిమా బిజినెస్ కూడా జరగలేదు అనే వార్తలొచ్చాయి.
అయితే, సినిమా టీజర్ బాగుండటం, వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్, మారుతి రైటింగ్ కలిపి సినిమా మార్కెటింగ్ టీమ్‌కి కాస్త ఊపు తీసుకొచ్చాయి. దీంతో ఓటీటీ డీల్, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కూడా అయిపోయాయి అనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ట్రైలర్‌ను ఎర్లీగా రిలీజ్ చేయడం, ఇంకో ట్రైలర్ కూడా కట్ చేసి సినిమా రిలీజ్‌కి ముందు తీసుకొస్తారని వార్తలు రావడం ‘సమ్‌థింగ్ ఫిషీ’ అనే మాటను బయటకు వచ్చేలా చేస్తున్నాయి. ఇప్పుడు సినిమా మీద అంచనాలను మరిన్ని పెంచి మరోసారి బిజినెస్‌ను పెంచే ఏర్పాట్లు చేస్తున్నారు అని ఓ టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి టీజర్ సమయంలో పారని ‘పీఆర్’ పాచిక.. ఇప్పుడు ట్రైలర్ సమయంలో పారుతుందేమో.