ప్రభాస్ హీరోగా ‘తానాజీ’ ఫేమ్ ఓంరౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆది పురుష్’. ఈ మధ్యనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. ఏకంగా 3డీలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు కూడా తెలియజేశారు. నిజానికి ఓం రౌత్.. ఓ బాలీవుడ్ దర్శకుడు. బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ లు ఉన్నారు. అయినప్పటికీ మన ప్రభాస్ ను మాత్రమే ఎందుకు ఎంచుకున్నట్టు..? అనే అనుమానం అందరిలోనూ ఉంది. దీనికి ‘ఆది పురుష్’ దర్శకుడు ఓం రౌత్ క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ… ‘‘ప్రభాస్ మాత్రమే ఈ పాత్రకు యాప్ట్ అనిపించింది.అతని పర్సనాలిటీ, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం, లోతైన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు ఇలా అన్ని విధాలుగా ప్రభాస్‌లో ‘ఆది పురుష్’ పాత్రను నేను చూశాను. ఒక వేళ ప్రభాస్ కనుక ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోకపోతే అస్సలు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకునే వాడిని కాదు…! వేరే హీరోని కూడా ఈ పాత్రకు ఊహించుకోలేకపోతున్నాను. ‘ఆది పురుష్’లో రాముడిని జీవితాన్ని ఎలా చూపించబోతున్నారు అని చాలా మంది అడుగుతున్నారు.
కానీ అప్పుడే ఆ విషయాన్ని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రస్తుతం మా టీం అంతా ఈ కథను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. అయితే ఇది ప్రభు రామ్ కథ. ఇతిహాసగాథలో ఒక భాగం. నా ఆలోచనలకు తగ్గట్టుగా రెడీ చేసుకున్నాను” అంటూ ఓంరౌత్ చెప్పుకొచ్చాడు.