మొసలికి నీటిలో ఉంటేనే బలం అంటారు. అలాగే సినిమా దర్శకులకు వాళ్ల జోనర్‌లో ఉంటేనే బలం. ఆ జోన్‌లో తీసే సినిమాకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే.. తేడా కొట్టేస్తుంది. అయితే ఓకే తరహా సినిమాలు చేస్తూ ఉంటారు ఆయన అనే మాట పడుతుంది. కానీ విజయాలు అందుకోవాలంటే అలాంటి సినిమాలే చేయాలి. అప్పుడప్పుడు ఛేంజ్ కోసం జోనర్ మార్చొచ్చు కానీ.. మొత్తంగా ఇటు వచ్చేయకూడదు. ఇప్పుడు పూరి జగన్నాథ్‌కి అందరూ ఈ సజెషనే ఇస్తున్నారు.
పూరి జగన్నాథ్ తొలి నాళ్లలో ప్రేమకథలు, కిక్ బాక్సింగ్, యాటిట్యూడ్ కథలు, హీరోయిజం నేపథ్య కథలు తీస్తూ వచ్చారు. విజయాలు భారీగానే అందుకున్నారు. ఆ తర్వాత డాన్‌లు, మాఫియాల నేపథ్యంలో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు. అయితే ఏమైందో మళ్లీ అటు నుండి వేరే వైపు వచ్చి ఇబ్బంది పడ్డారు. ‘లైగర్’ విషయంలోనూ ఇలానే జోనర్ మార్చి తేడా ఫలితం పొందారు. తనకు బాగా నప్పే మాఫియా/డాన్‌ల నేపథ్యంలో చేయాల్సింది అని ఫ్యాన్స్ ఇప్పుడు అనుకుంటున్నారు.
పూరి జగన్నాథ్ రీసెంట్ సినిమాలు చూస్తే.. ‘గోలీమార్’, ‘నేను నా రాక్షసి’, ‘బిజినెస్‌మేన్’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘లోఫర్’, ‘పైసా వసూల్’.. ఇలా చాలావరకు మాఫియా నేపథ్యంలోనే సాగాయి. వీటిలో అన్నీ విజయాలు లేకపోయినా డిజాస్టర్లు మాత్రం కాలేదు. ఆయా హీరోలకు కొత్త రకం సినిమాలు అయ్యాయి కూడా. కానీ ‘లైగర్’ విషయంలో దెబ్బ మామూలుగా లేదు. పేరు రాలేదు, డబ్బులూ రాలేదు, సంతృప్తి కూడా మిగలలేదు. దీంతో మీరు మారొద్దు సర్.. మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమాలే చేయండి అంటూ నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.
వరుస విజయాలు ఉండి, అంతా ఓకే అనుకున్నప్పుడు ప్రయోగాత్మకంగా వేరే సినిమా చేస్తే ఓకే కానీ.. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో పడతాం అని తెలిసినప్పుడు ఇలా నప్పే జోనర్ వదిలి వెళ్లిపోవడం సరికాదు అని చెబుతున్నారు. మరి పూరి నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. ‘జేజీఎం’ పోస్టర్లు బట్టి అయితే దేశభక్తి సినిమాలా ఉంది.