చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఇది అందరికీ తెలిసిందే. సినిమాల కోసం ఆయన పేరు మార్చుకున్నారనే విషయమూ తెలిసిందే. కానీ పేరు ఎందుకు మార్చుకున్నాడు, ఈ క్రమంలో ఏం జరిగింది అనేది చిరంజీవి ఇటీవల చెప్పుకొచ్చారు. శివశంకర్ వరప్రసాద్ ఎలా చిరంజీవి అయ్యాడు అనేది వివరంగా చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఆ వివరాలు మీ కోసం. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు చేస్తుండగానే ‘పునాది రాళ్లు’లో ఛాన్స్ వచ్చిందట కొణిదెల శివశంకర వరప్రసాద్‌కి.
ఆ సినిమా షూటింగ్ కోసం వెళ్తే స్క్రీన్ నేమ్ మార్చుకోవాల్సి వచ్చింది. కారణం ఆ పేరు పెద్దదిగా ఉండటం. పోనీ శంకర్, ప్రసాద్, శివ… ఇలా అని ఏదైనా పేరు చూసుకుందాం అంటే.. ఆ పేర్లతో అప్పటికే ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. దీంతో కొత్త పేరు పెట్టుకోక తప్పనిపరిస్థితి వచ్చిందట. అలా ఓ రోజు పేరు గురించి ఆలోచించుకుంటూ నిద్రపోయారట చిరంజీవి. ఆ రోజు కలలో చిరంజీవి రాములోరి గుడికి వెళ్లారట.
లోపల ఉన్న కొణిదెల శివశంకర వరప్రసాద్‌ని ఓ ఫ్రెండ్ వచ్చి.. లోపల ఏం చేస్తున్నావ్ చిరంజీవి బయటకు రా అని పిలిచారట. అదేంటి చిరంజీవి అంటున్నారు అనుకుంటూ మెలకువలోకి వచ్చారట. ఆ తర్వాత పని మీద నెల్లూరు వెళ్లి అక్కడ వాళ్ల అమ్మకు ఈ విషయం చెప్పారట. ‘‘నువ్వు పేరు మార్చుకోవాలి అని అంటున్నావ్‌గా. అందుకే ఇలాంటి కల వచ్చిందనుకుంటా. చిరంజీవి అంటే ఆంజనేయ స్వామి. ఆ పేరు పెట్టుకో బాగుంటుంది’’ అని చెప్పారట అంజనాదేవి.
అయితే చిరంజీవి పేరు బాగోదేమో అని కొంచెం తటపటాయించారట. పేరు విని ఎవరేం అనుకుంటారో అని అనుకున్నారట. కొన్ని రోజులుగా ఆగి సినిమా టీమ్‌కి విషయం చెప్పారట. వాళ్లకు పేరు బాగా నచ్చిందట. అక్కడికి కొద్ది రోజులకు ‘పునాది రాళ్లు’ సినిమాకు సంబంధించి రాజమండ్రిలో ఓ పత్రికా సమావేశం జరిగిందట. ఆ మరుసటి రోజు పేపర్‌లో సినిమా నటుల పేర్లతో చిరంజీవి అని కూడా పడిందట. అది చూసి చాలా ఆనందించాను అని చెప్పారు చిరంజీవి. అలా తన పేరు వెనుక కథ గురించి వివరించారు.