నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తండ్రి ఎన్టీఆర్ నట వారసత్వాన్ని ఇప్పటికీ భుజాలపై మోస్తున్నారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా తన కంటూ స్థానం సంపాదించుకున్నారు. అన్న గారిలాగే పౌరాణిక, జానపద చిత్రాలలో నటించగల ఈతరం నటుల్లో ఆయన ఒకరు. ఇక బాలయ్య డైలాగ్స్ చెప్పారంటే థియేటర్లలో పూనకాలు రావాల్సిందే. 60 ఏళ్లు నిండినా ఇంకా యువకులకి పోటీనిస్తూ సినిమాలు చేయడమే కాదు ఓటీటీలో హోస్ట్‌గానూ ఎంట్రీ ఇచ్చారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లు టాలీవుడ్‌ను దున్నేస్తూనే తమ చిత్రాలతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి హిందీ జనాలకు కూడా బాగా నోటెడ్ అయ్యారు. అయితే వీరి మాదిరిగా బాలకృష్ణ మాత్రం ముంబైలో అడుగుపెట్టలేకపోయారు. అన్నీ అనుకున్నట్టు జరిగివుంటే బాలయ్య కూడా బాలీవుడ్ లో సత్తా చాటేవాడని అంటుంటారు. ఆ అవకాశం ఆయనకు తృటిలో చేజారిపోయింది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం… బాలకృష్ణతో హిందీలో ఒక చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడట.
ఇందుకోసం ఆ రోజుల్లో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్. చంద్రను కలిశారు కూడా రత్నం.అదే సమయంలో బాలయ్య నటించిన నిప్పురవ్వ మంచి కలెక్షన్లు రావడంతో తెలుగు, హిందీలో తీసే ఈ సినిమాకు కలెక్షన్ ఈజీ అవుతుందని ట్రేడ్ పండితులు విశ్లేషించారు. అటు బాలయ్య సరసన నటించేందుకు పాపులర్ హీరోయిన్ అవసరం కనుక మాధురీ దీక్షిత్ కోసం రత్నం ఎంతగానో ప్రయత్నించారు. ఆలస్యంగానైనా మాధురీ ఒప్పుకున్నారు. అయితే డైరెక్టర్ చంద్ర, బాలకృష్ణ బిజీగా వుండిపోవడంతో ఏఎం రత్నం ప్రాజెక్ట్ అటకెక్కేసింది. ఇలా బాలీవుడ్ ఛాన్స్ బాలయ్యకు మిస్సయింది.