విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన `వారసుడొచ్చాడు` చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. కోలీవుడ్ నటుడు, దర్శకుడు మణివణ్ణన్ రూపొందించిన `తీర్థ కరైయినిలే` అనే తమిళ సినిమా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా అప్పట్లో మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. వెంకటేష్ కు జోడీగా సుహాసిని నటించగా నిర్మలమ్మ, మోహన్ బాబు, గొల్లపూడి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, రమాప్రభ, మాలాశ్రీ, వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రం విడుదలై 33 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ చిత్రానికి మన మహేష్ బాబు – త్రివిక్రమ్ ల ‘అతడు’ చిత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టు ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు చెప్పుకొచ్చారు. ‘వారసుడొచ్చాడు’ కథ విషయానికి వస్తే… నిరుద్యోగి అయిన బోస్ (వెంకటేశ్) ఓ యాక్సిడెంట్ బారిన పడడంతో హాస్పిటల్ లో జాయిన్ అవుతాడు. అక్కడ అతనికి మరికొద్దిరోజుల్లో చనిపోబోతున్న టీబీ పేషంట్ రఘు (వసంత్) పరిచయమవుతాడు. ఇద్దరూ స్నేహితులవుతారు. రఘు చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయి సిటీకి వచ్చినట్టు తన గతాన్ని బోస్ కి చెబుతాడు.
తనకి బదులుగా బోస్ ను తన ఊరెళ్ళి తన కుటుంబ సభ్యులను కలవమంటాడు రఘు. అలా వెంకటేష్ పాత్ర ఆ ఊరెళ్ళడం.. ఆ కుటుంబానికి ఎటువంటి గొడవలు రాకుండా చేయడం మధ్యలో హీరోయిన్ సుహాసినితో ప్రేమలో పడడం చివరికి ఇతను అసలు వారసుడు కాదు అని తెలియడం. సరిగ్గా మహేష్ బాబుతో త్రివిక్రమ్ రూపొందించిన `అతడు` కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ చనిపోయిన పార్ధు ప్లేస్ లో నందు వెళతాడు.. అలాగే ‘వారసుడొచ్చాడు’ లో నానమ్మ అయితే ఇక్కడ తాతయ్య, ఇలా పలు మార్పులు ఉంటాయి. ఒకే కథతో వచ్చినా రెండు సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి.