సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరు పదుల వయసులోనూ స్టార్ అన్న పదానికి నిలువెత్తు నిర్వచనంగా వున్నారు. దానికి కారణం ఆయన స్టైల్. ఆయన సినిమా విజయాల్లో పాటలదీ కీలక భాగమే. ఆ పాటల కోసమే నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టి రజనీని వినూత్నంగా చూపించి అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటిది రానున్న రజనీ సినిమాలో ఒక్కటంటే ఒక్కటే పాట ఉంటుందన్నది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘రోబో 2’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుందట. అదీ అమీ జాక్సన్, రజనీ పై తెరకెక్కించిన డ్యూయెట్ అని సమాచారం. తొలి పార్ట్ లో రోబోగా రజనీ విన్యాసాలతో పాటు ఏఆర్ రెహమాన్ పాటలు ప్రేక్షకులని మెప్పించాయి. ఈ సినిమాకి రెహమాన్ స్వరాలందిస్తున్నారు. ఈ డ్యూయెట్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ కి సరిపడా మరికొన్ని బిట్ సాంగ్స్ సిద్ధం చేశారట మన ఆస్కార్ గ్రహీత. తొలిభాగం కంటే సీక్వెల్ శక్తిమంతంగా ఉంటుందని, కథనంలో వేగం, ఎఫెక్ట్స్ హాలీవుడ్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటాయని శంకర్ ముందునుండీ చెబుతూ వస్తున్నారు. అందుకే భారతీయ సినిమాలో కీలకంగా ఉన్న పాటలకు సైతం కత్తెర వేశారు కాబోలు.