తమ సినిమా గురించి చెప్పడంలో కాకుండా, తమకు తాము కౌంటర్లు వేసుకుంటూ, సెటైర్లు విసురుకోవడం ఈ మధ్య సినిమా ప్రచారంలో ఎక్కువైపోయింది. సెల్ఫ్ సెటైర్ ఈజ్ న్యూ ప్రమోషన్ అని అంటున్నారు కూడా. ఇలా ప్రస్తుతం ప్రచారం చేసుకుంటున్న చిత్రబృందం ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) , రామ్ నితిన్ (Ram Nithin), నార్నే నితిన్ (Narne Nithin) , ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 28న వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కామెంట్ ఎక్కువగా వినిపిస్తోంది. అదే మూడో ‘మ్యాడ్’ (MAD) .
అవును, ‘మ్యాడ్’ సినిమాకు మరో సీక్వెల్ ఉంటుంది అని గతకొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని హీరోల దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర కామెంట్లు చేశారు. మీ అల్లరికి మూడో భాగం వస్తుందా? అని అడిగితే.. ఈసారి ప్రేక్షకులు అడిగినప్పుడే చేద్దాం అనుకుంటున్నామని సంగీత్ శోభన్ అన్నాడు. ‘మ్యాడ్’ సినిమాలు తప్ప మీరు వేరే సినిమాలు చేయడం లేదా? అని అడిగే ప్రమాదం ఉంటుంది కదా అని అన్నాడు.
ఇక రామ్ నితిన్ అయితే ‘మ్యాడ్’ సినిమా తర్వాత నార్నె నితిన్ ‘ఆయ్’ చేశాడు. తనకేమీ సమస్య లేదు. కానీ మా ఇద్దరినీ కొంతమంది మీకు ఇతర అవకాశాలేమీ రాలేదా, ‘మ్యాడ్’ సినిమాలొక్కటే చేస్తున్నారు అని అడుగుతున్నారు అని అన్నాడు. అయితే ‘మ్యాడ్’ ఫ్రాంచైజీ కొనసాగుతుంది. మూడో భాగం చేస్తాం అని నార్నె నితిన్ చెప్పాడు. అయితే ఈసారి కొంచెం సమయం పడుతుంది అని అన్నాడు. ఈ ముగ్గురూ ఎలా చెప్పినా.. రెండో ‘మ్యాడ్’ ఫలితం మీదే మూడో ‘మ్యాడ్’ ఉంటుంది అని చెప్పొచ్చు.
ఫైనల్లీ ‘మ్యాడ్ స్క్వేర్’ గురించి చెప్పండి అని అడిగితే.. నవ్వించడమే లక్ష్య్యంగా తీసిన సినిమా ఇది అని, ఈసారి మ్యాడ్ మ్యాక్స్ ( MAD 3) అన్నట్టే ఉంటుంది అని, అంచనాలకు దీటుగా రెట్టింపు స్థాయిలో నవ్విస్తుందీ చిత్రమని ఎవరికి వారు తమ అంచనాలను చెప్పుకొచ్చారు.