హైదరాబాద్… దేశంలో సినిమాలకు బాగా ఆదరణ ఉండే ప్రాంతాల్లో ఒకటి. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ థియేటర్లు ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ. ఇక సినిమా జనాలు కూడా ఎక్కువే. అందుకు తగ్గట్టే గతంలో టాలీవుడ్ అడ్డా హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినిమా ఉత్సవాలు జరిగేవి. దాంతోపాటు మరికొన్ని ఉత్సవాలు కూడా చేసేవారు. కానీ ఇటీవల కాలంలో అలాంటివి లేవు. అంతేకాదు తెలుగు సినిమాలకు పురస్కారాలు కూడా లేవు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే… తెలుగు సినిమా నిర్మాతలు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిని త్వరలో కలవబోతున్నారు. ఈ మేరకు టాలీవుడ్‌లో సీనియర్ నిర్మాతలు చాలా మంది ఈ దిశగా మాట్లాడుతున్నారు.
గత ప్రభుత్వం ఏం చేసింది అనేది పక్కన పెట్టేసి… కొత్త ప్రభుత్వం నుండి టాలీవుడ్‌కి మంచి జరిగేలా చూడాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. చిత్ర పరిశ్రమకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సహకారం మరే ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పాలి. ఆ విషయాన్ని గుర్తు చేసిన సి.కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరగడం లేదనే విషయాన్ని ప్రస్తావించారు.
మళ్లీ అలాంటి కార్యక్రమాల్ని ప్రారంభిస్తే నగరానికి, తద్వారా తెలంగాణకు విశేషమైన గుర్తింపు వస్తుంది అని చెప్పారు. దీంతోపాటు బాలల చలన చిత్రోత్సవాల్ని కూడా హైదరాబాద్‌కు తీసుకురమ్మని కోరతాం అని చెప్పారు. ఇక చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అన్ని రకాలుగా సాయమందిస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సినిమా జనాలు సీఎం రేవంత్‌ను ఎప్పుడు కలుస్తారు అనే చర్చ మొదలైంది.
అలాగే గతంలో తెలుగు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు నంది అవార్డులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తే అవి కూడా ఆగిపోయాయి. ఆ విషయం కూడా ముఖ్యమంత్రి (Revanth Reddy) వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. గత ప్రభుత్వం ‘సింహా పురస్కారం’ పేరుతో సినిమా పరిశ్రమకు అవార్డులు ఇస్తామని ప్రకటించింది. కానీ 9 ఏళ్ల కాలంలో అది జరగలేదు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!