తెలుగు సినిమా ప్రపంచం ఇప్పుడు పొరుగు కోలీవుడ్ మీద కూడా ప్రత్యేక ఆసక్తి చూపుతోంది. తాజాగా టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోలు వరుసగా తమిళ దర్శకులతో సినిమాలు చేయడానికి పచ్చ జెండా ఊపుతున్నారు. అది కేవలం చిన్న సినిమాలకే పరిమితం కాదు.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే భారీ బడ్జెట్ సినిమాలు కూడా తమిళ దర్శకుల చేతుల్లోకి వెళుతున్నాయి. ఎవరికి తోచినట్టు వారు సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ, సెట్స్ మీదకు వెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారు.
ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ప్రారంభిస్తే.. సలార్ (Salaar) హిట్ తర్వాత ఆయన లైనప్ మరింత పెరిగినట్లు టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తో చేయాలని ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాథమిక చర్చలు ముగిసినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. 2027లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందంటూ వినిపిస్తోంది. ఇక కింగ్ నాగార్జున (Nagarjuna) కూడా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ నవీన్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని టాక్.
అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సైతం అట్లీతో (Atlee Kumar) సినిమా చేయాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. ఈ కాంబోపై ఎప్పటి నుంచో చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందుకు వచ్చిందట. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్తో (Nelson Dilip Kumar) సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. జైలర్ 2 (Jailer) పూర్తి చేసిన తర్వాత నెల్సన్.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదే క్రమంలో నేచురల్ స్టార్ నాని (Nani) కూడా కోలీవుడ్ డైరెక్టర్ శిబి చక్రవర్తితో (Cibi Chakaravarthi) ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని సమాచారం. మొత్తానికి టాలీవుడ్ (Tollywood) హీరోలు కోలీవుడ్ దర్శకులతో చేతులు కలుపుతూ.. భాషల మధ్య సరిహద్దులు చెరిపేస్తున్నారు. ఇలా చూస్తుంటే, ఈ క్రాస్ ఇండస్ట్రీ కలయిక మరింత బలపడేలా ఉంది. మరి, ఈ కాంబినేషన్లన్నీ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తాయో చూడాలి.