పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు మధ్య మధ్యలో చిన్న సినిమాలు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అదే పని చేస్తోంది. ‘ఏజెంట్’, ‘భోళా శంకర్’ అంటూ భారీ చిత్రాలు సెట్స్ మీద ఉండగానే మూడు చిన్న సినిమాలు మొదలుపెట్టారు అనిల్ సుంకర. అందులో ఒకటి ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే ‘సామజవరగమన’. శ్రీవిష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీసు దగ్గర మంచి స్పందన వస్తోంది. అంతేకాదు ఈ సినిమా ఇప్పుడు మరో ఇండస్ట్రీకి కూడా వెళ్తోందట.
రాజేశ్ దండాతో కలసి, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘సామజవరగమన’. తొలుత ఈ సినిమా గురించి తెలిసినప్పుడు అనిల్ సుంకర్ చేయకూడదు అనుకున్నారట. ‘పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఆ ఒత్తిళ్ల మధ్య చిన్న సినిమా ఎందుకు’’ అనుకున్నారట. అయితే సందీప్ కిషన్ మాత్రం ‘మీరు చేయాలి’ అంటూ ‘సామజవరగమన’ కథను అనిల్ దగ్గరకు పంపించారట. ఇలాంటి మంచి కథను పంపించినందుకు సందీప్‌కి థ్యాంక్స్ అంటూ అనిల్ ఖుష్ అయిపోయారు.
సినిమా విజయంపై ముందు నుండి చాలా నమ్మకంగా ఉన్నా (Sree Vishnu) విడుదలకు ముందే వేసి స్పెషల్ షోల వల్ల ఇంకా ఎక్కువ నమ్మకం కలిగిందట. దర్శకుడు రామ్ అబ్బరాజు, రచయితలతో మరో సినిమాని చేస్తామని అనిల్ ప్రకటించారు. అంతేకాదు ‘సామజవరగమన’ సినిమాను తమిళంలోనూ రీమేక్ చేసే ఆలోచన కూడా ఉందని చెప్పారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో తమిళ వెర్షన్ సంగతులు వెల్లడిస్తామని కూడా చెప్పారు.
చిన్న సినిమాల క్రమంలో చేసిన ‘హిడింబ’ విషయంలోనూ హ్యాపీగా ఉన్నామని అనిల్ తెలిపారు. విడుదలకు ముందే ఆ సినిమా లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పారు. ఇది కాకుండా ‘ఊరు పేరు భైరవకోన’ అనే మరో సినిమా కూడా సిద్ధంగా ఉంది అని చెప్పారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాను విఐ ఆనంద్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోస్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.