అనేకమంది వందల రోజులు శ్రమిస్తేనే ఒక సినిమా తయారవుతుంది. మరి ఆ మూవీ విజయవంతమవ్వాలంటే ఎన్నో అంశాలు కలిసిరావాలి. ముఖ్యంగా టైటిల్ ముందుగా ప్రజల్లోకి వెళ్లాలి. సినిమా పేరు నచ్చిందంటే.. ఆ చిత్రం దాదాపు హిట్ అయినట్టే లెక్క. ఏంటి నమ్మలేకపోతున్నారా? ఉదాహరణకు ఈ సినిమాలు చూడండి.
బాహుబలి
అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి.. వీరి చుట్టూ కథ నడుస్తుంది. అందుకే రాజమౌళి వీరి పేరుతోనే టైటిల్ పెట్టారు. ఆ పేరులోనే బలమే సినిమాకి పెద్ద విజయాన్ని అందించడానికి దోహదపడింది.
అర్జున్ రెడ్డి
ప్రతిభావంతుడు.. ప్రేమికుడు.. ఆవేశపరుడు.. ఇటువంటి లక్షణాలున్న వ్యక్తి పేరున రెడ్డి ఉంటే.. ఆ లక్షణాలు మరింత రెట్టింపు అవుతాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బోల్డ్ ప్రేమ కథకి అర్జున్ రెడ్డి అని సందీప్ వంగ పేరు పెట్టి సూపర్ హిట్ కొట్టారు.
భరత్ అనే నేను
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు. భరత్ అనే వ్యక్తి సీఎం గా ప్రమాణం చేసేటప్పుడు వాడే మొదటి పదాలతో సినిమా టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ తోనే ఈ మూవీ అందరినీ ఆకర్షించింది.
కుమారి 21F
తెలుగు అమ్మాయిలంటే అందం. అమాయకత్వం ఉంటుంది. సహజంగానే కొంచెం సిగ్గు ఉంటుంది. ఇలా కాకుండా బోల్డ్ గా ఉండే అమ్మాయి కథతో తెరకెక్కిన సినిమా కుమారి 21F. ఈ చిలిపి అమ్మాయిగా హెబ్బా పటేల్ చక్కగా నటించి టైటిల్ కి న్యాయం చేసింది.
చంద్రముఖి
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే అతని పేరుతోనే టైటిల్ ఉంటుంది. కానీ ఓ ఆత్మ పేరుని సినిమాకి పెట్టి విజయం సాధించారు. సినిమా మొత్తం ఆ ఆత్మ చుట్టూ జరుగుతుంది కాబట్టి సినీ అభిమానులు ఈ పేరుకి విజయాన్ని ఇచ్చారు.
శంకర్ దాదా MBBS
గొడవలతో బతికే ఓ దాదా డాక్టర్ చదివితే ఎలా ఉంటుందో… అనే కథతో తెరకెక్కిన సినిమా శంకర్ దాదా MBBS. కథకి తగ్గ టైటిల్. ఆ టైటిల్ రోల్లో చిరంజీవి ఇరగదీసి సూపర్ హిట్ కొట్టారు.
మైఖేల్ మదన కామరాజు, జై లవ కుశ
ఒక సినిమాలో ఒకే నటుడు రెండు అంతకంటే ఎక్కువ రోల్స్ పోషించినప్పుడు ఆ విషయం స్పష్టంగా తెలిసేలా మైఖేల్ మదన కామరాజు, జై లవ కుశ.. మారిరిగా పేర్లు పెట్టి విజయం కైవశం చేసుకున్నారు.
మహానటి
అభినేత్రి సావిత్రి పేరు చెప్పగానే అందరి నోటి నుంచి వచ్చే మొదటి మాట మహానటి. ఆ ఆలోచనతోనే నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ కి మహానటి అని పేరు పెట్టి ఆకట్టుకున్నారు.
రజినీకాంత్ సినిమాలు
టైటిల్ తోనే సినిమాకు ఆకర్షణ తీసుకురావాలని రజనీకాంత్ నటించిన అనేక చిత్రాలకు అతను పోషించిన పాత్ర పేరునే టైటిల్ గా పెట్టారు. బాషా, ముత్తు, అరుణాచలం, నరసింహ, లింగా, శివాజీ .. ఇలా ఎన్నో సినిమాలు విజయం సాధించాయి.
ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు టైటిల్ పై కసరత్తు చేస్తుంటారు. ఈ జాబితాలోకి వచ్చే సినిమా పేర్లు మేము మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి.