టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ ఈరోజు అనారోగ్యంతో మరణించారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన చికిత్స పొందుతూ వచ్చినప్పటికీ.. పరిస్థితి మరింత క్షీణించడంతో..కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్య నిపుణులు చాలా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. తర్వాత కొద్దిసేపటికి ఆయన తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. ఇక శరత్ మరణ వార్త తెలియగానే టాలీవుడ్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
పలువురు సినీ ప్రముఖులు ఈయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈయనకి వివాహం చేసుకోలేదు. గతంలో ఈయన పలు హిట్లు అందుకున్న దర్శకుడే. దాదాపు 20 చిత్రాల వరకు ఈయన దర్శకత్వంలో తెరకెక్కాయి.`డియర్` అనే నవలను ఆధారంగా చేసుకుని `చాదస్తపు మొగుడు` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయనకి ఇదే మొదటి చిత్రం. తర్వాత నందమూరి బాలకృష్ణతో ‘వంశానికొక్కడు’ ‘పెద్దన్నయ్య’ ‘సుల్తాన్’ ‘వంశోద్ధారకుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.
బాలయ్య కంటే ముందు సుమన్ తో కూడా `చాదస్తపు మొగుడు’ ‘పెద్దింటి అల్లుడు’ ‘బావ-బావమరిది’ ‘చిన్నల్లుడు’ వంటి చిత్రాలని తెరకెక్కించారు. ఈయన్ని దర్శకుడిగా పరిచయం చేసింది సుమన్. సూపర్ స్టార్ కృష్ణతో `సూపర్ మొగుడు` అనే చిత్రాన్ని కూడా రూపొందించారు శరత్.